బోల్డ్ డైరెక్టర్ చేతిలో ఘట్టమనేని వారసుడు?

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు.;

Update: 2025-05-06 10:30 GMT

నెక్స్ట్ ఘట్టమనేని కుటుంబం నుంచి కూడా హీరోల నెంబర్ పెరగనుంది. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్స్ తర్వాత, ఇప్పుడు కొత్త తరం వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని హీరోగా తొలి సినిమాకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అటు సితార ఘట్టమనేని కూడా సినిమాల్లోకి వస్తుందనే టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు. ‘హీరో’ సినిమాతో తొలిసారి ఆకట్టుకున్న అశోక్, ఆ తర్వాత ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుధీర్ బాబు కుమారులు కూడా త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో తెరంగేట్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు.

అతను మారెవరో కాదు.. రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ‘RX 100’, ‘మంగళవారం’ సినిమాలతో బోల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడని ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతోంది. అజయ్ భూపతి ప్రస్తుతం ‘మంగళవారం 2’తో బిజీగా ఉన్నప్పటికీ, ఈ భారీ ప్రాజెక్ట్‌ను కూడా లైన్ లోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం. జయకృష్ణ ఇప్పటికే లండన్‌లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన డెబ్యూ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కథ, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు, కానీ ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జయకృష్ణ బాబాయ్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని, నిర్మాణంలో కొన్ని కీలక అంశాలను కూడా చూస్తున్నాడని టాక్. మొత్తంగా, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పండగలా ఉంది. అజయ్ భూపతి లాంటి బోల్డ్ డైరెక్టర్ చేతిలో జయకృష్ణ డెబ్యూ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News