దళపతి వారసుడొస్తున్నాడు కానీ..!
ఇలాంటి సమయంలో విజయ్ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసుడొస్తున్నాడన్న ప్రచారం హీటెక్కిస్తోంది.;
దశాబ్ధాల పాటు తమిళ చిత్రసీమను ఏలిన రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ స్టార్లు ఇంకా ఉన్నా, వారందరినీ బాక్సాఫీస్ నంబర్లలో అధిగమించిన వాడిగా నిరూపించాడు దళపతి విజయ్. వరుసగా డబుల్ సెంచరీలు కొట్టడంలో విజయ్ హవా గురించి చెప్పాల్సిన పని లేదు. ఈరోజుల్లో 500కోట్లు సునాయాసంగా వసూలు చేయగల హీరో. కానీ దళపతి అనూహ్యంగా రాజకీయాల్లోకి వెళుతూ సినిమాలను పూర్తిగా విడిచిపెట్టడం చర్చగా మారింది.
ఇలాంటి సమయంలో విజయ్ లెగసీని ముందుకు నడిపించేందుకు వారసుడొస్తున్నాడన్న ప్రచారం హీటెక్కిస్తోంది. విజయ్ వారసుడు జాసన్ సంజయ్.. తన తండ్రిలా నటుడు కావడం లేదు కానీ దర్శకుడిగా నిరూపించుకోవాలని తపిస్తున్నాడు. ప్రారంభమే తన కథను దుల్కార్ సల్మాన్ లాంటి స్టార్ కి వినిపించాడు. కానీ అతడు కాదని నిరాశపరచడంతో వెంటనే తెలుగు హీరో సందీప్ కిషన్ ని ఎంపిక చేసుకున్నాడు. తాజా సమాచారం మేరకు.. సందీప్ కిషన్ తో సినిమా చిత్రీకరణలో జాసన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తయింది. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే మార్చిలో రిలీజ్ చేస్తారని కూడా తెలిసింది. ఫస్ట్ లుక్ ఈ నెలలోనే విడుదలయ్యేందుకు ఛాన్సుందని తెలిసింది.
అయితే ఇటీవలే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసుడు కూడా తండ్రి బాటలో నటుడు అవ్వకుండా, దర్శకుడిగా మారాడు. అతడు తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే గాక, సాహసోపేతమైన అతడి ఆలోచనలు, క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు అందరూ. ఇప్పుడు జాసన్ విజయ్ కూడా ఆర్యన్ ఖాన్ లా నిరూపించాల్సి ఉందన్న గుసగుస వినిపిస్తోంది. తాజా పరిణామం చూస్తుంటే నటవారసుడు లేదా పరిశ్రమ ఇన్ సైడర్ పై ఉండే ఒత్తిడి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆర్యన్ రేంజులో జాసన్ ఆరంగేట్రం చేస్తాడా లేదా? అన్నది వేచి చూడాలి.