కోలీవుడ్‌లో జాన్వీ కపూర్‌.. తప్పుడు నిర్ణయం

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి చాలా కాలం అయింది.;

Update: 2025-04-24 21:45 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడికి అక్కడ సూపర్‌ హిట్ దక్కలేదు. టాలీవుడ్‌లో ఈమె చేసిన మొదటి సినిమా దేవరతోనే సూపర్ హిట్‌ దక్కించుకుంది. శ్రీదేవికి ఉన్న క్రేజ్‌ నేపథయంలో టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. దేవర సినిమా విడుదలకు ముందే రామ్‌ చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే. పెద్ది సినిమాలో ఈమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. పెద్ది విజయంపై జాన్వీ కపూర్ చాలా నమ్మకంగా ఉంది. మరో వైపు ఈమె కోలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధం అయింది.

బాలీవుడ్‌లో ఈమె చేస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ వాటిల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరుస్తున్నాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పరమ్‌ సుందరి సినిమాలో సిద్దార్థ్‌ మల్హోత్రకి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పెద్ది సినిమాతో పాటు ఆ హిందీ సినిమాపై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. తప్పకుండా ఈ రెండు సినిమాలతో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న జాన్వీ కపూర్‌కి కోలీవుడ్‌ నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ సున్నితంగా వాటికి నో చెబుతూ వచ్చింది. ఇప్పుడు జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌ విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న పా రంజిత్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ నటించేందుకు ఓకే చెప్పిందట. ఆయన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. రా కంటెంట్‌తో రూపొందే ఆ సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇప్పుడు జాన్వీ కపూర్‌ తో పా రంజిత్ ఒక భారీ వెబ్ సిరీస్‌ను రూపొందించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక వెనుకబడిన తెగకు చెందిన అమ్మాయి కథతో వెబ్ సిరీస్‌ను రూపొందించేందుకు గాను పా రంజిత్ స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. ఆ వెబ్‌ సిరీస్‌లో మెయిన్ లీడ్‌ పాత్రకు గాను జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. జాన్వీ కపూర్‌ కి ప్రస్తుతం ఉన్న బజ్‌ నేపథ్యంలో కోలీవుడ్‌లో స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకునే అవకాశం ఉంది. గతంలో చాలా కమర్షియల్‌ పాత్రలు వచ్చాయి. కానీ ఈమె మాత్రం పా రంజిత్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉంది.

ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుడు నిర్ణయం అంటున్నారు. కొందరు మాత్రం నటిగా నిరూపించుకుంటే తప్పకుండా ముందు ముందు మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌ లో ముందు ముందు ఈమె చేసే ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయి అనేది ఈ వెబ్‌ సిరీస్ ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌కి జాన్వీ కపూర్‌ ఏ కారణంతో ఓకే చెప్పింది అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News