ఫ్లాప్స్‌తో హ్యాట్రిక్.. పాపం జాన్వీ ఇప్పుడేం చేస్తోంది?
ఇక ఈ ఏడాది చివరగా సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు రాబట్టలేకపోయింది.;
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అడుగు పెట్టి ఏళ్లకు ఏళ్లు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ దక్కించుకోలేక పోయింది. ఏడు సంవత్సరాల్లో జాన్వీ కపూర్ నటించిన చాలా సినిమాలు హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో జాన్వీ కపూర్ పాత్రల గురించి మాట్లాడుకోవడం మనం చూశాం. కానీ ఆయా సినిమాలు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రం మనం చూడలేక పోయాం. ఆమె కేవలం గ్లామర్ వల్ల ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. నెపో కిడ్ కావడం వల్ల కూడా కొన్ని సినిమా ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో ఆమెపై ఆసక్తి తగ్గింది. పెద్ద సినిమాల్లో ఆమెకు కనీసం ఆఫర్లు రావడం లేదు, చిన్నా చితక సినిమా ఆఫర్లు మాత్రమే ఆమె తలుపు తడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ హిందీ సినిమాలకు కమిట్ కాలేదని అంటున్నారు.
జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ కపూర్ సినిమాలు సెట్స్ పై ఉండగానే కొత్త సినిమాలను చేయడం పనిగా పెట్టుకుంది. కానీ జాన్వీ కపూర్ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె చేస్తున్న తెలుగు సినిమా పెద్ది మాత్రమే సెట్స్ పై ఉంది. అది కాకుండా అల్లు అర్జున్ - అట్లీ కాంబో మూవీలోనూ ఈమె కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. ఆ సినిమాపై అధికారిక ప్రకటన రాలేదు. అది కాకుండా మరే సినిమా గురించి ప్రచారం లేదు, ప్రకటన లేదు. అందుకే జాన్వీ కపూర్ గురించి సోషల్ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నెట్టింట ఆమె షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి, కానీ ఆమె సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడం విచారకం. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ కెరీర్ నిలబడాలి అంటే ఒక సాలిడ్ సక్సెస్ అవసరం ఖచ్చితంగా ఉంది.
రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్
ఈ ఏడాది జాన్వీ కపూర్ నటించిన మూడు హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో మొదటగా హోమ్ బౌండ్ సినిమా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చాలా నమ్మకంతో పరమ్ సుందరి సినిమాతో జాన్వీ కపూర్ వచ్చింది. పరమ్ సుందరి సినిమాలో జాన్వీ కపూర్ అందంతో పాటు, సినిమా ప్రమోషన్ సమయంలో విడుదల చేసిన వీడియోల కారణంగా అంచనాలు పెరిగాయి. కానీ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. సినిమా కోసం జాన్వీ చేసిన రెయిన్ డాన్స్ బూడిదలో పోసిన పన్నీరు అయింది. పరమ్ సుందరి ఒక పక్కా కమర్షియల్ రొమాంటిక్ మూవీ అని అంతా నమ్మకంగా ఉన్నారు. కానీ సినిమా విషయంలో అందరి అంచనాలు తారు మారు అయ్యాయి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి సినిమా..
ఇక ఈ ఏడాది చివరగా సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి సినిమాతో వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు రాబట్టలేకపోయింది. తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించింది. కానీ ఆమెకు సినిమా కమర్షియల్ బ్రేక్‌ను తెచ్చి పెట్టలేదు. ఈ ఏడాదిలో ఏకంగా మూడు ఫ్లాప్స్ తో హ్యాట్రిక్ పడ్డ జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కమిట్ అయిన రెండు సినిమాలను సైతం ఆమె అగ్రిమెంట్ చేసుకోకుండా క్యాన్సల్ చేసిందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ సినీ కెరీర్‌ను బోనీ కపూర్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నాడని, అందుకోసం బోనీ కపూర్ స్వయంగా కథలు వింటున్నాడని అంటున్నారు. బోనీ కపూర్ నిర్మాణంలో జాన్వీ కపూర్ సినిమా ఉండే అవకాశం ఉంది. అది వచ్చే ఏడాదిలో వస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది. 2026 లో జాన్వీ కపూర్ పెద్దితో కాకుండా మరే సినిమాతో రాకపోవచ్చు అని ఆమె సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఈసారి హిందీలో వస్తే జాన్వీ కపూర్ గట్టిగా రావాలని ప్రయత్నాలు చేస్తుందట. ఆమె ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.