సీఎం విజ‌య్ నుంచి సినిమా పోస్టులు

ఐతే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చాక విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ మీద కాస్త ఫోక‌స్ చేస్తున్నారు. విజ‌య్ మామూలుగానే పెద్ద‌గా ప్ర‌మోష‌న్లు చేయ‌డు.

Update: 2026-07-21 13:01 GMT

నెల‌న్న‌ర‌ ముందు వ‌ర‌కు జోసెఫ్ విజ‌య్ ఒక సినిమా హీరో, ఒక కొత్త పార్టీ అధినేత‌ మాత్ర‌మే. కానీ జూన్ రెండో వారంలో ఆయన త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రి అయిపోయారు. విజ‌య్ సీఎం అవ్వ‌గానే.. సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌ అయిదు నెల‌ల‌కు పైగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఆయ‌న చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్‌కు మోక్షం వ‌చ్చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ విజ‌య్ రాష్ట్ర అత్యున్న‌త ప‌ద‌విని చేప‌ట్టాక కూడా జ‌న‌నాయ‌గ‌న్ బ‌య‌టికి రాలేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు అన్ని అడ్డంకుల‌నూ దాటుకుని ఈ గురువార‌మే జ‌న‌నాయ‌గ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జ‌న‌నాయ‌గ‌న్ సంక్రాంతి నుంచి వాయిదా ప‌డి నెల‌ల త‌ర‌బ‌డి విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయిన టైంలో ఆ సినిమా గురించి విజ‌య్ పెద్ద‌గా మాట్లాడింది లేదు. ఎన్నిక‌లు ముగిశాక‌, సీఎం అయ్యాక కూడా విడుద‌ల సంగ‌తి ఎటూ తేల‌క‌పోవ‌డం అభిమానుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. విజ‌య్ ఎందుకు ఆ చిత్రాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు, నిర్మాత‌ను బ‌య‌ట‌ప‌డేసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు అనుకున్నారు.

ఐతే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు క్లియ‌రెన్స్ వ‌చ్చాక విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ మీద కాస్త ఫోక‌స్ చేస్తున్నారు. విజ‌య్ మామూలుగానే పెద్ద‌గా ప్ర‌మోష‌న్లు చేయ‌డు. రిలీజ్ ముంగిట ఒక ఈవెంట్లో పాల్గొంటాడు. జ‌న‌నాయ‌గ‌న్‌కు సంబంధించి ఆ ఈవెంట్ జ‌న‌వ‌రిలోనే పూర్త‌యింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక‌గా ఈ చిత్రంపై పోస్టులు వేస్తున్నాడు విజ‌య్. సీఎం అయ్యాక త‌న ఎక్స్ అకౌంట్లో తొలిసారిగా సినిమా పోస్టు వేసింది జులై 11న. ఆ రోజు జ‌న‌నాయ‌గ‌న్‌కు సెన్సార్ పూర్త‌యిన‌ట్లు ఒక పోస్ట‌ర్ వ‌దిలాడు విజ‌య్. త‌ర్వాత రిలీజ్ డేట్ ఖ‌రారు చేస్తూ, కొత్త పాట లాంచ్ చేస్తూ పోస్టులు పెట్టాడు.

తాజాగా జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్‌కు మూడు రోజుల ముందు అదిరిపోయే యాక్ష‌న్ గ్లింప్స్ ఒక‌టి పోస్టు చేశాడు విజ‌య్. జ‌న‌నాయ‌గ‌న్‌ను టీం పెద్ద‌గా ప్ర‌మోట్ చేయ‌ట్లేదు. విజ‌య్ ఈ పోస్టుల‌తో పుష్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కానీ నిజానికి ఏ ప్ర‌మోష‌న్లు లేకుండానే త‌మిళ వెర్ష‌న్ బంప‌ర్ ఓపెనింగ్స్ తీసుకురాబోతోంద‌ని అర్థ‌మైంది. తెలుగులో మాత్రం విజ‌య్ గ‌త చిత్రాల మాదిరి దీనికి బ‌జ్ లేదు. సినిమా బాగా లేట‌వ‌డం, పైగా ఇది రీమేక్ కావ‌డంతో మ‌న వాళ్లు లైట్ తీసుకుంటున్న‌ట్లున్నారు.

Tags:    

Similar News