పవన్ 'జల్సా' రీ రిలీజ్.. హీట్‌ లో హద్దులు దాటాయా?

అభిమానుల హడావుడి, సంబరాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అవే కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీస్తున్నాయి.;

Update: 2025-12-31 10:21 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. ఒకప్పుడు హిట్‌ గా నిలిచిన సినిమాలను మరోసారి థియేటర్లలో విడుదల చేస్తూ.. అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు మేకర్స్. దీంతో రీ రిలీజ్ అయిన చాలా చిత్రాలు ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తూ, కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అభిమానుల హడావుడి, సంబరాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. అవే కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఇష్టమైన సినిమాల్లో జల్సా ఒకటి. ఖుషి తర్వాత పవన్ నుంచి సరైన సినిమా రాలేదని అభిమానులు భావిస్తున్న సమయంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా అందరినీ ఆకట్టుకుంది. అల్లు అరవింద్ నిర్మించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి మెప్పించింది.

పవన్ కెరీర్‌ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన జల్సా మూవీని.. పవర్ స్టార్ పుట్టినరోజు సెప్టెంబర్ 2ను పురస్కరించుకుని రీ రిలీజ్ చేయాలని గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేసింది. ప్రత్యేక ప్రణాళికతో సినిమాను విడుదల చేయాలని భావించింది. కానీ అల్లు ఫ్యామిలీలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో వాయిదా వేసింది.

తాజాగా డిసెంబర్ 31వ తేదీన థియేటర్లలో జల్సా మరోసారి విడుదల చేసింది. దీంతో థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి కనిపించింది. డప్పులు, బ్యానర్లు, కటౌట్లు, నినాదాలతో థియేటర్లు కళకళలాడాయి. చాలా చోట్ల అభిమానులు సంబరాలు చేసుకుంటూ.. తమ అభిమాన సినిమా చూసేందుకు తరలివచ్చారు.

అయితే, కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు వివాదస్పదంగా మారాయి. థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతో కొందరు వ్యక్తులు వికృత చేష్టలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ అభిమానులు అని చెబుతూ కొందరు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేస్ తో మార్ఫడ్ మాస్క్‌ లు ధరించి థియేటర్లలో కొందరు ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది.

అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా.. ఫ్యాన్ వార్స్‌ కు, రాజకీయ అంశాలకు సినిమా థియేటర్లను వేదికగా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. అభిమానం హద్దులో ఉంటేనే అది ఆనందంగా ఉంటుందని, కానీ ఇలాంటి పనులు చేస్తే రీ రిలీజ్ ట్రెండ్‌ కే మచ్చ పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఇప్పుడు జల్సా మూవీ రీ రిలీజ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ.. కొన్ని చోట్ల జరిగిన ఘటనలు మాత్రం రీ రిలీజ్ హీట్ లో హద్దు దాటడంతో వివాదానికి దారి తీశాయి. దీంతో థియేటర్స్ లో ఎప్పుడూ అలాంటి వికృత చేష్టలు వద్దని అనేక మంది నెటిజన్లు సూచిస్తున్నారు.




Tags:    

Similar News