హాస్పిటల్ పాలైన జైలర్ నటుడు.. అసలేం జరిగిందంటే?

మలయాళ నటుడు వినాయకన్ తన సినిమాల ద్వారా కంటే వివాదాస్పద పనులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-25 10:01 GMT

మలయాళ నటుడు వినాయకన్ తన సినిమాల ద్వారా కంటే వివాదాస్పద పనులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యం మధ్యలో పబ్లిక్ లో గొడవ చేస్తూ పలుమార్లు అరెస్టు కూడా అయ్యారు. అలాంటి ఈయన తాజాగా హాస్పిటల్ పాలవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ప్రస్తుతం హాస్పిటల్ పాలైన నటుడు వినాయకన్ కు అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు రజినీకాంత్. ఇందులో విలన్ పాత్రతో ఊహించని ఇమేజ్ దక్కించుకున్న వినాయకన్ తాజాగా ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆడు 3 సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయంలోకి వెళ్తే.. సినిమా షూటింగ్లో భాగంగా తొడుపుజలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ఆయనను కొచ్చిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

ప్రమాదంలో భాగంగా భుజం మెడలో నరాలు, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయట. సమయానికి ఆసుపత్రికి చేర్చడంతో వైద్యులు నరాల డ్యామేజ్ ను గుర్తించారు. దీంతో ఆయన తీవ్ర పక్షపాతం నుంచి తప్పించుకున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరువారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆడు 3 షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక జయ సూర్య హీరోగా నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వినాయకన్ పరిస్థితి తెలియడంతో అటు సెలబ్రిటీలు ఇటు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

వినాయకన్ విషయానికి వస్తే.. 1995లో వచ్చిన మాంత్రికం అనే సినిమాలో నటించి తన కెరీర్ ను ప్రారంభించారు. 2016లో రాజీవ్ రవి చిత్రం కమ్మటి పాదంలో గంగా పాత్రతో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును దక్కించుకున్నారు. ఇకపోతే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయనకు మాత్రం జైలర్ సినిమాతో ఊహించని పాపులారిటీ లభించింది.

ఈ సినిమా తర్వాత మరింత వెలుగులోకి వచ్చిన ఈయన.. పలుమార్లు వివాదాలలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. 2023 అక్టోబర్ 24న కొచ్చిలోని ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో గొడవ సృష్టించినందుకుగాను ఈయనను అరెస్టు చేశారు. ఈ ఘటన అటు కుటుంబ వివాదానికి కూడా దారితీసింది. ఆ తర్వాత వైద్య పరీక్షల తర్వాత ఆయనను బెయిల్ మీద విడుదల చేశారు. తర్వాత 2024 సెప్టెంబర్ 7న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గేట్ సిబ్బందితో జరిగిన గొడవ తర్వాత హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు 2025 మే 9న ఒక హోటల్లో మద్యం తాగి క్రమ రహితంగా ప్రవర్తించినందుకు కూడా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇలా పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి హాట్ టాపిక్ గా మారారు.

Tags:    

Similar News