దసరా బరిలో రజినీ వర్సెస్ విజయ్ తప్పేలా లేదుగా!
అయితే ఈసారి దసరా రేసు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దసరా సీజన్ అంటే సౌత్ సినీ ఇండస్ట్రీకి ఎప్పుడూ ప్రత్యేకమైన బాక్సాఫీస్ సమయమే. సెలవులు, పండుగ వాతావరణం కలిసి రావడంతో పెద్ద సినిమాలు ఈ సీజన్‌ను టార్గెట్ చేస్తుంటాయి. అయితే ఈసారి దసరా రేసు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్2 అక్టోబర్ 15కే రిలీజ్ కానుందని మేకర్స్ మరోసారి క్లారిటీ ఇవ్వడంతో, అదే సీజన్‌ను టార్గెట్ చేస్తున్న ఇతర సినిమాల లెక్కలు కూడా మారే పరిస్థితి ఏర్పడింది.
టాలీవుడ్ లో అదే సమయంలో విజయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి కూడా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ తప్పకపోవచ్చు. ఒకవైపు దశాబ్దాలుగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకున్న సూపర్‌స్టార్.. మరోవైపు యూత్ లో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ. ఈ ఇద్దరి సినిమాలు ఒకే పండుగ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తే, అది కేవలం రెండు సినిమాల పోటీగా మాత్రమే ఉండదు. రెండు విభిన్న మార్కెట్లు, రెండు విభిన్న ప్రేక్షక వర్గాల మధ్య జరిగే బాక్సాఫీస్ పోరుగా మారవచ్చు.
అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన అంశం థియేటర్ల పంపిణీ. పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజైనప్పుడు స్క్రీన్ల కేటాయింపు ఎప్పుడూ కీలకంగా మారుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే జైలర్2 కు భారీ స్థాయిలో థియేటర్లు దక్కే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విజయ్ దేవరకొండ సినిమాకు కూడా భారీ రిలీజ్ దక్కే అవకాశముంది. పెళ్లి తర్వాత విజయ్- రష్మిక కలిసి చేస్తున్న సినిమా కావడంతో పాటూ, ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పడం చూస్తుంటే మేకర్స్ రిలీజ్ విషయంలో అసలు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఎగ్జిబిటర్లకు ఈ రెండు సినిమాల స్క్రీన్ షేరింగ్ పెద్ద సవాలుగా మారొచ్చు.
ఇక్కడ రిలీజ్ డేట్ కంటే ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా కీలక పాత్ర పోషించనుంది. రజినీకాంత్ సినిమాకు ఉన్న బ్రాండ్ వాల్యూ ఒకవైపు ఉంటే, విజయ్ దేవరకొండ తన సినిమాను యూత్ ఆడియన్స్ కు ఎంత స్ట్రాంగ్‌గా రీచ్ చేస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. పండుగ సెలవులను ఎవరు ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటారన్నదే ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
జైలర్2 రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఇప్పుడు బాల్ మిగతా సినిమాల కోర్టులో పడినట్టే. విజయ్ దేవరకొండ రణబాలి అదే సీజన్‌లో నిలబడుతుందా? లేక బాక్సాఫీస్ క్లాష్‌ను తప్పించుకునేందుకు కొత్త వ్యూహాన్ని ఎంచుకుంటుందా? అన్నది చూడాలి. ఒకవేళ రెండు సినిమాలు పోటీకి సిద్ధమైతే మాత్రం ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద స్టార్ పవర్ వర్సెస్ యూత్ పవర్ అనే ఇంట్రెస్టింగ్ ఫైట్ ఖాయమే.