జైల‌ర్2 పై తమిళనాడు రాజకీయాల ఎఫెక్ట్..

తమిళనాడు రాజకీయ పరిణామాల ప్రభావం సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్‌పై పడిందనే ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

Update: 2026-09-01 12:30 GMT

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైల‌ర్2 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జైల‌ర్‌కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం ఫ్యాన్స్ లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందు మరో అంశం చర్చకు వస్తోంది. తమిళనాడు రాజకీయ పరిణామాల ప్రభావం సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్‌పై పడిందనే ప్రచారం కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

జైల‌ర్‌2 లో రాజకీయ నేపథ్యాన్ని టచ్ చేసే కొన్ని సీన్స్ ఉన్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే సినిమా రూపొందుతున్న సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం, ఇప్పుడు రిలీజ్ టైమ్ కు మారిన పరిస్థితులు ఒకేలా లేవ‌న్న విష‌యం తెలిసిందే. దీంతో మారిన ఆ ప‌రిస్థితుల‌కు సంబంధించిన సీన్స్ వివాదానికి దారి తీసే అవ‌కాశ‌ముండ‌టంతో ముందుగానే దానిపై టీమ్ ఆలోచించి జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే జైల‌ర్2లోని కొన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చే పనులు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏ డైలాగ్‌ను మార్చారు, అసలు ఎంత మేరకు మార్పులు చేశారు అనే విషయంలో ఇప్పటివరకు అఫీషియ‌ల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని కేవలం ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్క‌ష‌న్‌గానే చూడాల్సి ఉంటుంది.

అయితే సినిమా కోసం ఎక్స్‌ట్రా షూటింగ్ లేదా మార్పులు చేయడ‌మ‌నేది తప్పనిసరిగా సినిమా విషయంలో సమస్య ఉందని అర్థం కాదు. భారీ బడ్జెట్ సినిమాల్లో ఫైనల్ కట్‌కు ముందు కొన్ని సీన్స్ ను మళ్లీ షూట్ చేయ‌డం, డైలాగ్స్ మార్చడం, ఎడిటింగ్‌లో మార్పులు చేయడం సాధారణ ప్రక్రియే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉండటంతో మేకర్స్ చిన్న విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంటుంటారు.

ఇక జైల‌ర్2 రిలీజ్ డేట్ విషయంలోనూ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన అక్టోబర్ 15 తేదీ నుంచి సినిమా దీపావళి సీజన్‌కు వెళ్లే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఫెస్టివల్ సీజన్‌లో రిలీజైతే రజినీకాంత్ మార్కెట్‌కు అది ఎక్స్‌ట్రా స్ట్రెంగ్త్ గా మారే అవకాశం ఉంది. తమిళనాడుతో పాటు తెలుగు, కేరళ, కర్ణాటక మార్కెట్లలోనూ దీపావళి సెలవులు ఓపెనింగ్స్‌కు ఉపయోగపడొచ్చు. అందుకే జైల‌ర్2 విషయంలో జరుగుతున్న మార్పులను కేవలం ఆలస్యంగా కాకుండా, సినిమాను రిలీజ్ కు మరింత సిద్ధం చేసే ప్రక్రియగా కూడా చూడొచ్చు. పొలిటిక‌ల్ డైలాగ్స్ విషయంలో నిజంగా మార్పులు జరిగాయా? రిలీజ్ డేట్ అక్టోబర్‌లోనే ఉంటుందా, లేక దీపావళికి మారుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం మేకర్స్ నుంచి అఫీషియ‌ల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News