జైల‌ర్ ఆధిప‌త్యానికి దురంధ‌ర్ బ్రేకులు?

అయితే దీనికోసం మేక‌ర్స్ కి అద‌న‌పు సమ‌యం కావాలి. అందుకే మార్చి నుంచి ఆగ‌స్టుకు రిలీజ్ తేదీని వాయిదా వేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.;

Update: 2025-12-15 20:30 GMT

రెండు పెద్ద సినిమాలు ఒకే తేదీకి విడుద‌లైతే ఆ రెండిటి ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అగ్ర హీరోల సినిమాలు క్లాష్ అయితే ఆ రెండిటికీ న‌ష్టం త‌ప్ప‌దు. ఓపెనింగులు ఘోరంగా ప‌డిపోతాయి. ఆ త‌ర్వాత నెగెటివ్ టాక్ వ‌చ్చిన సినిమా పూర్తిగా నాశ‌న‌మ‌వుతుంది. అందుకే ఎవ‌రూ సాహ‌సించి వేరొక‌రితో పోటీప‌డి బ‌రిలో దిగాల‌ని అనుకోరు.

కానీ ఇప్పుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా అలాంటి అనూహ్య‌ ప‌రిస్థితిని ఎదుర్కోనుంది. ర‌జ‌నీకి త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల‌లో ఎవ‌రూ పోటీ కాదు. కానీ ఉత్త‌రాదిన ర‌జ‌నీ న‌టించిన సినిమాకు గ‌ట్టి పోటీ ఎదుర‌వ్వ‌నుంది. మ‌రింత డీటెయిల్డ్ గా వివ‌రాల్లోకి వెళితే..

ర‌జ‌నీ క‌థానాయ‌కుడిగా నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించ‌నున్న `జైల‌ర్ 2`ని 2026 ఆగ‌స్టు 14న విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోంది. `జైల‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో `జైల‌ర్ 2`ని కూడా అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న నిర్మాత‌లు భారీగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

అయితే జైల‌ర్ దూకుడుకు దురంధ‌ర్ బ్రేక్ వేస్తాడ‌ని భావిస్తున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ఆదిత్యాధ‌ర్ తెర‌కెక్కించిన `దురంధ‌ర్` గ్రాండ్ సక్సెస్ సాధించిన నేప‌థ్యంలో ఈ సినిమా సీక్వెల్ ని అత్యంత భారీగా తెర‌కెక్కించాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. దీంతో మార్చిలో రిలీజ్ కావాల్సిన దురంధ‌ర్ 2 ఆగ‌స్టులో స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా విడుదల‌కు వెళుతోంది. దురంధ‌ర్ అనూహ్య‌మైన విజ‌యం సాధించింది. ఇది రెండో వారంలోను స్థిర‌మైన వ‌సూళ్ల‌ను సాధిస్తూ ఆశ‌లు రేకెత్తించింది. ఇప్ప‌టికే 300 కోట్లు అధిగ‌మించి 500 కోట్ల క్ల‌బ్ దిశ‌గా సాగుతోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. దురంధ‌ర్ విజ‌యం నేప‌థ్యంలో రెండో భాగాన్ని అత్యంత భారీగా రూపొందించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప విజ‌యం త‌ర్వాత `పుష్ప 2` కోసం ఎలాంటి మార్పులు చేయాలనుకున్నారో, అలాంటి ప్ర‌య‌త్న‌మే ఇప్పుడు `దురంధ‌ర్ 2` విష‌యంలోను జ‌రగ‌నుంది.

అయితే దీనికోసం మేక‌ర్స్ కి అద‌న‌పు సమ‌యం కావాలి. అందుకే మార్చి నుంచి ఆగ‌స్టుకు రిలీజ్ తేదీని వాయిదా వేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొత్త డేట్ వ‌స్తే, అద‌నంగా మ‌రో 4 నెల‌ల స‌మ‌యం అందుబాటులో ఉంటుంది. థియేట్రికల్ గా ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ సినిమాని ఓటీటీల్లోను పోటీప‌డి వీక్షిస్తార‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఓవ‌రాల్ గా దురంధ‌ర్ పార్ట్ 2 పై మ‌రింత ఆస‌క్తి పెరుగ‌నుంది. ఈ ఏడాది ఆగ‌స్టులో వార్ 2, కూలీ విడుద‌ల కాగా కూలీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ హ‌వా సాగించింది. `వార్ 2` ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాస్ట్ ఫెయిల్యూర్ గా మారింది.

Tags:    

Similar News