జగపతి బాబు విలన్ అవుతానంటే సురేష్ బాబు ఏమన్నారో తెలుసా?
హీరోగా స్టార్‌డమ్ చూసిన తర్వాత కెరీర్‌లో వచ్చే మార్పులను అంగీకరించడం చాలా మందికి కష్టమవుతుంది.
హీరోగా స్టార్‌డమ్ చూసిన తర్వాత కెరీర్‌లో వచ్చే మార్పులను అంగీకరించడం చాలా మందికి కష్టమవుతుంది. కానీ జగపతి బాబు మాత్రం తన ప్రయాణాన్ని ఎంతో నిజాయితీగా చూసుకున్న నటుడిగా మరోసారి నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, హీరోగా తన మార్కెట్ తగ్గిపోయిన దశ నుంచి విలన్‌గా మళ్లీ ఎలా పునర్జన్మ పొందారో ఆసక్తికరంగా వివరించారు. అదే సమయంలో కొన్ని సినిమాలు కేవలం డబ్బు కోసం మాత్రమే చేశానని చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
మంచి దర్శకులంటే తనకు అపారమైన గౌరవమని చెప్పిన జగపతి బాబు, కొంతమంది దర్శకులు కథను, పాత్రలను అద్భుతంగా అర్థం చేసుకుని నటుడి నుంచి ఉత్తమమైన నటన రాబట్టగలరని, అలాంటి వాళ్ల కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. అయితే ఇండస్ట్రీలో అందరూ అలాంటివాళ్లు కారని కూడా స్పష్టం చేశారు. కొంతమంది వరస్ట్ డైరెక్టర్లు ఉంటారని, వాళ్లతో పని చేస్తున్నప్పుడు తాను కూడా వరస్ట్ యాక్టర్‌లా మారిపోతానని, వాళ్లు ఏం చెప్తే అది మాత్రమే చేసి డబ్బు తీసుకుని వచ్చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఆ డైరెక్టర్లు సరైనవారు కాదని తెలిసినా, ఇంట్లో ఖాళీగా కూర్చోలేక, ఆర్థిక అవసరాల కోసం చేశానని ఆయన ఓపెన్‌గా అంగీకరించారు.
అలాగే హీరోగా తన కెరీర్ ముగిసిందని తాను చాలా ముందుగానే గ్రహించానని జగపతి బాబు తెలిపారు. తన 95వ సినిమా టైమ్ లోనే తన మార్కెట్ గురించి తనకు క్లారిటీ వచ్చిందని, ప్రేక్షకుల అభిరుచి మారుతోందని అర్థమైందని తెలుసుకున్నానన్నారు. రెండు మూడు సినిమాల ఆఫర్లు వచ్చినా, మీ డబ్బులు వేస్ట్ అవుతాయని నిర్మాతలకే చెప్పి వాటిని రిజెక్ట్ చేసినట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన వద్ద డబ్బు లేకపోయినా, బలవంతంగా హీరో పాత్రలు చేయలేదని వెల్లడించారు. ప్రవరాఖ్యుడు సినిమా టైమ్ కు తాను హీరోగా కంటిన్యూ కాకూడదని పూర్తిగా నిర్ణయించుకున్నానని చెప్పారు. హీరో అనే ట్యాగ్‌ను అప్పుడే పక్కన పెట్టేశానని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత తన లైఫ్ లో వచ్చిన అనిశ్చితి గురించి కూడా జగపతి బాబు ఎమోషనల్ గా మాట్లాడారు. ఇక నేను హీరో కాదు, మరిప్పుడు ఏం చేయాలనే ప్రశ్న తనను వెంటాడిందన్నారు. ఒక దశలో సీరియల్స్ చేయాలా అనే ఆలోచన కూడా వచ్చిందని, రోజుకు రూ.5 వేలైనా వస్తే సరిపోతుందని అనిపించేదని చెప్పారు. అదే సమయంలో నిర్మాత సురేష్ బాబు వద్దకు వెళ్లి నేను విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందని అడిగానని గుర్తుచేసుకున్నారు. అయితే సురేష్ బాబు మొదట ఆశ్చర్యపోయారని, విలన్ అంటే లావుగా, భయంకరంగా ఉండాలి. నీకు అది సెట్ అవదని చెప్పారని తెలిపారు. కానీ తన మనసులో మాత్రం విలన్ పాత్రలపై ఆసక్తి పెరుగుతూనే ఉందన్నారు.
ఆ ఆలోచన నిజమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విలన్‌గా వచ్చిన తొలి అవకాశమే జగపతి బాబు కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అక్కడి నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు దక్కించుకుని, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత బిజీ నటులలో ఒకరిగా మారిపోయారు. తన పని అయిపోయిందనుకున్న తర్వాత కూడా మరో 90 సినిమాలు చేయగలిగానని జగపతి బాబు చెప్పిన మాటలు, కెరీర్‌లో మార్పును అంగీకరించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయి. హీరో నుంచి విలన్‌గా, అక్కడి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనను తాను మళ్లీ మళ్లీ రీడిఫైన్ చేసుకున్న జగపతి బాబు ప్రయాణం, ఈ తరానికి ఓ స్పెషల్ ఇన్సిపిరేషన్ గా నిలుస్తోంది.