అనీల్ రావిపూడితో జ‌గ‌ప‌తిబాబు క్రేజీ ఎంట‌ర్‌టైన‌ర్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు జగపతి బాబు.

Update: 2026-07-15 07:33 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు జగపతి బాబు. అప్పట్లో క్లాసిక్ ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన శోభ‌న్ బాబులా ఇద్ద‌రేసి హీరోయిన్ల స‌ర‌స‌న న‌టించారు. అయితే అనూహ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత క్రూరమైన, శక్తివంతమైన విలన్ పాత్రల్లోకి ఒదిగిపోయి అందరినీ మెప్పించారు. ఇటీవల ఓ సినిమా ప్రచార వేడుకలో ఈ విలక్షణ నటుడు తన సుదీర్ఘ సినీ ప్రయాణం, తనకు ఇష్టమైన దర్శకులు.. మునుముందు రోజుల్లో తాను చేయాలనుకుంటున్న సరికొత్త పాత్రల గురించి చాలా సరదాగా, నిజాయితీగా మాట్లాడారు. ఈ సంభాషణ ఆయనకు సినిమాలపై ఉన్న తపనను.. నిరంతరం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే కోరికను మరోసారి బయటపెట్టింది.

ఈ వేడుకలో ముఖ్యంగా అప‌జ‌య‌మెరుగ‌ని స‌క్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో జగపతి బాబు సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తాను పెద్ద అభిమానినని .. భవిష్యత్తులో తనతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని చూపించారు జగపతి బాబు. ఇటీవ‌ల‌ వరుసగా చేస్తున్న సీరియస్, విలన్ పాత్రల నుండి కాస్త విరామం కావాలని... తన మైండ్ రిలాక్స్ అయ్యేలా మళ్లీ ఒక మంచి కామెడీ లేదా వినోదాత్మక పాత్ర చేయాలని గట్టిగా కోరుకుంటున్నట్లు అనీల్ రావిపూడికి చెప్పారు.

జగపతి బాబు కోరికపై స్పందించిన దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒకసారి జగపతి బాబు గారు తనకు ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి పిలిపించారని చెప్పారు. తాను ఎప్పుడూ సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తున్నానని.. ఈసారి ఎలాగైనా ఒక మంచి హిలేరియస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ చేయాలని జగపతి బాబు తనతో అన్నట్లు అనిల్ వివరించారు. ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోయినా అతి త్వరలోనే తమ కలయికలో ఒక అవుట్ అండ్ అవుట్ వినోదాత్మక చిత్రం పక్కాగా ఉంటుందని అనిల్ రావిపూడి స్వ‌యంగా జగపతి బాబుకు మాట ఇచ్చారు.

ఆ తర్వాత యాంకర్ జగపతి బాబు సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన పని చేసిన దర్శకులలో వదలకుండా మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించే ఆ ఒక్క దర్శకుడు ఎవరని ప్రశ్నించారు. దీనికి జగపతి బాబు ఏమాత్రం తడుముకోకుండా.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టక్కున సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) పేరు చెప్పారు. ఈ సమాధానం వినగానే అక్కడున్న వారంతా ఎంతో ఉత్సాహపడ్డారు. వీరిద్దరి కలయికలో వచ్చిన `గాయం` వంటి క్లాసిక్ సినిమాలు తెలుగు చిత్రసీమలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయో ఈ సమాధానం మరోసారి గుర్తుచేసింది.

మొత్తంమీద ఈ చిన్న సంభాషణ జగపతి బాబులోని నిత్య అన్వేషకుడైన నటుడిని మనకు పరిచయం చేసింది. ఒకవైపు అనిల్ రావిపూడి వంటి నేటి తరం కమర్షియల్ దర్శకులతో కలిసి వినోదాత్మక పాత్రలు చేయాలనే తపన... మరోవైపు తన కెరీర్‌ను మలుపు తిప్పిన రామ్ గోపాల్ వర్మ వంటి అనుభవజ్ఞులైన దర్శకులపై ఉన్న అపారమైన గౌరవం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి. జగపతి బాబు త‌దుప‌రి చిత్రాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆయన మళ్లీ కామెడీ పాత్రల్లోకి తిరిగి రాబోతున్నారనే వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

Tags:    

Similar News