రూ.200 కోట్ల స్కామ్‌లో 'సాహో' బ్యూటీకి ఊరట
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కావడంతో ఆయనతో సంబంధం ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.;
'సాహో' సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో, పాటల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ షో తో మెప్పిస్తూ వస్తుంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. తెలుగులో ఈమెకు పలు ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్‌లో బిజీగా ఉండటం వల్ల వాటికి నో చెప్పింది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈమెకు ముఖ్య పాత్రలో నటించేందుకు గాను ఆఫర్ దక్కింది. కానీ ఆ సమయంలోనే ఈమె రూ.200 కోట్ల స్కామ్ లో చిక్కుకుంది. దాంతో వీరమల్లు ఆఫర్ మాత్రమే కాకుండా చాలా ఆఫర్లు ఈమెకు చేజారాయి.
సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కావడంతో ఆయనతో సంబంధం ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. సుఖేష్ నుంచి లక్షల విలువ చేసే ఖరీదైన బహుమానాలు జాక్వెలిన్‌కి అందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకే ఈమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. జాక్వెలిన్ అరెస్ట్ కావడం ఖాయం అని, దోషిగా తేలి శిక్ష అనుభవించాల్సిందే అంటూ చాలా మంది జాక్వెలిన్ గురించి చెబుతూ వచ్చారు. కానీ తాజాగా జాక్వెలిన్ పై ఉన్న కేసును ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఈడీ అధికారులు తనపై మోపిన అభియోగాలకు సరైన సాక్ష్యాలు లేని కారణంగా తనపై ఉన్న కేసులను తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనకు సుఖేష్ నుంచి వచ్చిన బహుమానాలు వాస్తవం, కానీ అవి మనీ లాండరింగ్‌తో సంబంధం ఉన్న డబ్బులు అని తనకు తెలియదు అని కోర్టుకు చెప్పింది. అంతే కాకుండా సుఖేష్ యొక్క కేసులతో, ఆయన ఆర్థిక కార్య కళాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిరూపించుకుంది. కేవలం సుఖేష్ తో ఉన్న పరిచయం వల్ల దోషిగా తేల్చడం సరి కాదని ఆమె చేసిన వాదనలకు కోర్టు సంతృప్తి చెందింది. సుఖేష్ నుంచి ఆమె ఉద్దేశ పూర్వకంగా బహుమానాలు తీసుకోలేదు, అతడి గురించి, అతడి నేర చరిత గురించి తెలియక పోవడం వల్లే అతడితో సన్నిహితంగా ఉన్నట్లు కోర్టు నమ్మింది. అందుకే జాక్వెలిన్ పై ఉన్న కేసును కొట్టి వేయడం జరిగింది.
మనీ ల్యాండరింగ్ కేసు కారణంగా ఏకంగా పది సినిమాలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోల్పోయింది అని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌లో పాటు సౌత్‌లోనూ ఈమె సినిమా ఆఫర్లను కోల్పోయింది. ఈ సాహో బ్యూటీ తనపై పడ్డ ఆరోపణలను కోర్టు ద్వారా అవాస్తవాలు అని నిరూపించింది. కనుక ఇండస్ట్రీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే వెంటనే సాధ్యం కాకపోవచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే జాక్వెలిన్‌కి మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం జాక్వెలిన్ కి సుఖేష్ వంటి ఆర్థిక నేరస్థుడితో సంబంధాలు ఉన్న కారణంగా ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాల్సిందే అని అంటున్నారు.