మాటలు రాని హీరోతో.. 'ఇట్లు అర్జున'
సాధారణంగా మొదటి సినిమా అంటే కొత్త హీరోలు భారీ డైలాగులు, మాస్ ఎలివేషన్లు కోరుకుంటారు. కానీ ఇందులో హీరో అనీష్ ది చాలా ఛాలెంజింగ్ రోల్ అని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.;
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. కానీ తన మొదటి సినిమాతోనే ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం విశేషం. 'ఛలో', 'భీష్మ' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా మారారు. 'వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై ఆయన నిర్మిస్తున్న మొదటి సినిమా 'ఇట్లు అర్జున'. ఈ సినిమా ద్వారా అనీష్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా మొదటి సినిమా అంటే కొత్త హీరోలు భారీ డైలాగులు, మాస్ ఎలివేషన్లు కోరుకుంటారు. కానీ ఇందులో హీరో అనీష్ ది చాలా ఛాలెంజింగ్ రోల్ అని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో హీరోకి మాటలు రాని మూగవాడు. కేవలం కళ్లతో, హావభావాలతోనే ఎమోషన్ పండించాలి. డెబ్యూ మూవీకే ఇలాంటి రిస్క్ తీసుకోవడం, సైలెన్స్ తోనే హీరోయిజం చూపించాలనుకోవడం నిజంగా సాహసమే. అయితే గ్లింప్స్ లో అనీష్ నటన చూస్తుంటే ఆ పాత్రకు న్యాయం చేసినట్లే కనిపిస్తోంది.
హీరోకి మాటలు రాకపోయినా, ఆ క్యారెక్టర్ ఎలివేషన్ కు కింగ్ నాగార్జున గొంతు తోడవ్వడం ఈ గ్లింప్స్ కు మేజర్ ప్లస్ పాయింట్. "ప్రేమ ఎంత దూరమైనా పరిగెత్తిస్తుంది.. కానీ ఎంత ఇష్టమో చెప్పనివ్వదు" అంటూ నాగ్ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమా సోల్ ఏంటో చెప్పేసింది. ఒక స్టార్ హీరో సపోర్ట్ ఇలా దొరకడం కొత్త హీరోకి కొండంత బలం. ఆ గంభీరమైన వాయిస్ తో హీరో క్యారెక్టర్ డెప్త్ ను ఆడియెన్స్ కు కనెక్ట్ చేశారు.
ఇక గ్లింప్స్ లో అనీష్ లుక్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. లవర్ బాయ్ గా సాఫ్ట్ గా కనిపిస్తూనే, యాక్షన్ సీన్స్ లో ఇంటెన్స్ గా ఉన్నాడు. ముఖ్యంగా వర్షంలో వచ్చే యాక్షన్ షాట్స్, స్లింగ్ షాట్ వాడే విధానం కొత్తగా ఉన్నాయి. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫ్రెష్ గా, నేచురల్ గా అనిపిస్తోంది. రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా ఏదో బలమైన ఎమోషన్ ఉందనిపిస్తోంది.
కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల ఈ కథను డీల్ చేస్తున్న విధానం బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. దీనికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. తమన్ తన మార్క్ ఆర్ఆర్ తో సీన్స్ ను ఎలివేట్ చేశారు. రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ను ప్లజెంట్ గా చూపించింది. ఒక కొత్త హీరో సినిమాకి ఈ రేంజ్ టెక్నికల్ టీమ్ పని చేయడం అంటే నిర్మాత వెంకీ కుడుముల క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతోంది.