ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని టార్గెట్ చేసింది ఎవ‌రు?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి కొత్త రాజ‌కీయా పార్టీ టీవీకెతో కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ అరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-08 18:30 GMT

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి కొత్త రాజ‌కీయా పార్టీ టీవీకెతో కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ అరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీని ప్ర‌క‌టించిన నాటి నుంచే క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేస్తూ కార్య‌క‌ర్త‌ల‌ని త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం చేస్తూ కార్య‌క్ర‌మాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మ‌లుపులు తిర‌గ‌డం మొద‌లైంది. పార్టీ జెండా నుంచి మొద‌లైన విజ‌య్ స‌మ‌స్య‌ల స‌మ‌రం ఇంటి వ‌ర‌కు వెళ్లి బ‌హిరంగ చ‌ర్చ‌కు తెర‌లేపింది. క‌రూర్ తొక్కిస‌లాట విజ‌య్‌ని సీబీఐ గ‌డ‌ప తొక్కేలా చేస్తే భార్య సంగీత విడాకుల వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

నామినేష‌న్‌తో పాటు అనేక సంద‌ర్భాల్లో విజ‌య్ వ్య‌క్తిగతంగా టార్గెట్ అవుతూ వ‌స్తున్నాడు. త్రిష‌తో క‌లిసి చెన్నైలోని ఓ వివాహ వేడుక‌కు హాజ‌రు కావ‌డం, దానిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు విజ‌య్‌. అంత‌కు ముందు `జ‌న నాయ‌గ‌న్` రిలీజ్ చుట్టూ సెన్సార్ వివాదం త‌లెత్త‌డం, అది వారంలో స‌ద్దుకుంటుంది అనుకుంటే మూడు నెల‌ల‌కు పైనే సాగ‌దీస్తూ ఇప్ప‌టికీ రిలీజ్‌కు దారులు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ సినిమా రిలీజ్ ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌ని తేలిపోయింది. ఈ వివాదం, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై విజ‌య్ స్పందించ‌లేదు. మౌనం పాటిస్తూ వ‌చ్చాడు.

అయితే ఇటీవ‌ల‌ నామినేష‌న్ విష‌యంలో `ఎస్ఓపీ`ని ప్ర‌త్యేకంగా తీసుకొచ్చి త‌న‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక్క‌సారిగా విజ‌య్ బ‌ర‌స్ట్ అయ్యారు. `జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ వివాదం వెన‌క కుట్ర‌కోణం ఉంద‌ని బాహాటంగానే వెల్ల‌డించిన విజ‌య్ తాజాగా త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం, త‌న వ్య‌క్త‌గత జీవితంలో మొద‌లైన స‌మ‌స్య‌ల‌పై తొలిసారి స్పందించారు. `జ‌న నాయ‌గ‌న్‌` రిలీజ్‌ని ఆపింది ఎవ‌రో త‌న‌కు తెలుస‌ని చెప్పిన విజ‌య్ త‌న‌ని రాజ‌కీయాల్లోకి రాకుండా అడ్డుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

త‌న‌ని ఎన్నిర‌క‌రాలుగా ఇబ్బందుల‌కు గురి చేసినా త‌న‌ని ఏమీ చేయ‌లేక‌పోయార‌ని, వాటికి నేను భ‌య‌ప‌డ‌కుండా ముందుకు సాగ‌డంతో మ‌రో స‌మ‌స్య‌ని తెర‌పైకి తీసుకొచ్చి త‌న‌ని ఇబ్బంది పెట్టే ప్రయ‌త్నం చేశార‌ని ప‌రోక్షంగా త‌న భార్య సంగీత విడాకుల వ్య‌వ‌హారం గురించి చెప్పుకొచ్చారు. అంటే విజ‌య్ మాట‌ల‌ని బ‌ట్టి చూస్తే సంగీత‌ని కావాల‌నే విడాకుల నోటీసులు ఇవ్వాల‌ని ఎవ‌రో ఫోర్స్ చేశారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తన చుట్టూ ఎన్నిర‌కాల స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నా తాను ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌డంతో త‌న చుట్టూ ఉన్న వాళ్ల‌ను ఉప‌యోగించుకుని ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల‌కు 30 రోజుల ముందు త‌న మీద ఆరోప‌ణ‌లు చేయించారంటూ విజ‌య్ విడాకులు వ్య‌వ‌హారం వెనుక జ‌రిగిన కుట్ర‌ని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది. ఎన్నిర‌కాలుగా త‌న‌ని ఇబ్బందుల‌కు గురి చేసినా తాను ఆగ‌న‌ని, త‌న‌ని ఎవ‌రూ ఆప‌లేర‌ని, జ‌నం కోసం తాను ఎంత దూర‌మైనా వెళ‌తార‌న‌ని విజ‌య్ స్ప‌ష్టం చేయ‌డంతో త‌మిళ‌నాట కొత్త చ‌ర్చ మొద‌లైంది. విజ‌య్‌ని టార్గెట్ చేసింది ఎవ‌రు? అధికార పార్టీనా? లేక కేంద్ర పార్టీనా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది?. విజ‌య్‌తో పొత్తుకు ప్ర‌య‌త్నించిన పార్టీ దీని వెన‌క ఉందా? ..పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌ల వెనుక అధికార పార్టీ వ‌ర్గాలు ఉన్నాయా? అని త‌మిళ‌నాడులో చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News