60 కోట్ల స్కామ్.. నిర్మాతపై 5 గంటలు 100 ప్రశ్నలు
ఈ ఆర్థిక మోసం కేసులో ఈరోజు ప్రత్యేక నేర విభాగం పోలీసులు దాదాపు 5 గంటల పాటు సదరు నిర్మాతను విచారించారు.;
దాదాపు 60 కోట్ల స్కామ్ కు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాతను ఆర్థిక నేరాల విభాగం కొన్నాళ్లుగా విచారిస్తోంది. బంగారం, బల్క్ కమోడిటీస్, మీడియా సహా మొత్తం ఐదు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ ఈ నేరానికి పాల్పడినట్టు ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇవోడబ్ల్యూ) గుట్టు మట్లు కనుగొంది. ఈ కేసును తవ్వే కొద్దీ రహస్యాలెన్నో బయటపడుతున్నాయని సమాచారం.
ఈ ఆర్థిక మోసం కేసులో ఈరోజు ప్రత్యేక నేర విభాగం పోలీసులు దాదాపు 5 గంటల పాటు సదరు నిర్మాతను విచారించారు. దాదాపు 100 ప్రశ్నలు అడిగారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణలో భాగంగా, నిర్మాత కం పారిశ్రామిక వేత్త (ఇటీవల నటుడయ్యాడు) భార్య (ప్రముఖ నటి, రియాలిటీ టీవీ జడ్జి)కి కూడా ముంబై పోలీస్ సమన్లు పంపి విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో మోసగాడిగా భావిస్తున్న సదరు నిర్మాత, తోపు అని ప్రూవ్ చేసిన ప్రముఖ హిందీ టీవీ చానెల్ హెడ్ తోను డీల్ కుదుర్చుకుని డబ్బును దుర్వినియోగం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొదటి రౌండ్ విచారణ పూర్తయింది. మరో వారంలో తదుపరి విచారణకు నిర్మాతను పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నేరానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లను ముంబై క్రైమ్ పోలీసులు ఛేజిక్కించుకున్నారు. దీనిని నేర విభాగాల పోలీసులు కూడా ఇప్పుడు రివ్యూ చేయనున్నారు. ఐదు కంపెనీల్లో నిర్మాత కం పారిశ్రామిక వేత్త 60 కోట్ల డబ్బును పెట్టుబడి పెట్టినట్టు విచారణలో అంగీకరించాడు. ఆ సమయంలో మోసం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అతడు డబ్బును దుర్వినియోగం చేసి ఉండవచ్చని .. లేదా వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించడమో లేక సంబంధం లేని ఖర్చుల కోసం వేరే వ్యక్తులకు డబ్బు మళ్లించి ఉండొచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. అలా మళ్లించిన డబ్బు ప్రముఖ టీవీ చానెల్ అధినేత్రికి కొంత చేరి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
గోదాం కోసం, ప్రసారాల కోసం 24కోట్లు ఖర్చు చేయగా, కార్యాలయం అద్దె కోసం ఏకంగా 25 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చెప్పడంతో ఇది నేరవిభాగాల ప్రత్యేక పోలీసులకు అనుమానాలు పెంచింది. తన సొంత కంపెనీ నుంచి సెలబ్రిటీ ఫీజుగా 4కోట్లు చెల్లించడం కూడా ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇది కంపెనీ నిధుల దుర్వినియోగం కేసుగా మారేందుకు అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పాపులర్ టీవీ చానెల్ అధినేత్రి కం నిర్మాత ప్రమేయం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.