#బ్యాన్ ది సెన్సార్.. ఆర్జీవీ కంటే ముందే విరుచుకుపడ్డ ఆ నలుగురు!
స్మార్ట్ ఫోన్‌లు, ఏఐ టూల్స్ - ఓటీటీలు అందుబాటులో ఉన్న కాలంలో ఒక ప్రభుత్వ కమిటీ వయోజనుల ఆలోచనలను నియంత్రించాలనుకోవడం ముూర్ఖత్వమని ఆర్జీవీ తన తాజా ఇన్ స్టా లేఖలో ఫైరయ్యారు.
స్మార్ట్ ఫోన్‌లు, ఏఐ టూల్స్ - ఓటీటీలు అందుబాటులో ఉన్న కాలంలో ఒక ప్రభుత్వ కమిటీ వయోజనుల ఆలోచనలను నియంత్రించాలనుకోవడం ముూర్ఖత్వమని ఆర్జీవీ తన తాజా ఇన్ స్టా లేఖలో ఫైరయ్యారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో సెన్సార్ బోర్డ్‌పై జరుగుతున్న సుదీర్ఘ పోరాటాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఆర్జీవీ స్ట్రాంగ్ కోటింగ్ నేపథ్యంలో.. గతంలో సెన్సార్ బోర్డ్ (CBFC) వైఖరిపైనా.. దాని ఆంక్షలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడి, #బ్యాన్ ది సెన్సార్ అనే నినాదానికి బలాన్ని చేకూర్చిన ఐదుగురు ప్రముఖ సెలబ్రిటీల పోరాటాల గురించిన వివరాల్లోకి వెళితే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ):
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డ్ ఉనికినే సవాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ అత్యంత పదునైన విమర్శలు చేశారు. స్మార్ట్‌ఫోన్‌లు, ఏఐ టూల్స్ - ఓటీటీలు అందుబాటులో ఉన్న కాలంలో ఒక ప్రభుత్వ కమిటీ వయోజనుల ఆలోచనలను నియంత్రించాలనుకోవడం ముూర్ఖత్వమని ఎద్దేవా చేసారు. దేశాన్ని నడిపించే నాయకుడిని ఎన్నుకునే మెచ్యూరిటీ ఉన్న ఓటరును, థియేటర్లో ఒక సీన్ చూసి పాడైపోయే చిన్న పిల్లల్లా చూడటం ద్వంద్వ నీతి అని మండిపడ్డారు. కత్తెర్లు వేయడం ఆపి, సినిమాలో ఏముందో ముందే చెప్పి చూసే హక్కును ప్రేక్షకులకే వదిలేయాలని, ఇండస్ట్రీ అంతా ఏకమై ఈ వ్యవస్థపై కోర్టుల్లో పోరాడాలని ఆర్జీవీ పిలుపునిచ్చారు. భారతదేశంలోని అన్ని సినీపరిశ్రమల నిర్మాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కమల్ హాసన్:
భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖుడు, విశ్వనటుడు కమల్ హాసన్ కూడా సెన్సార్ బోర్డ్ వైఖరిపై అనేక సందర్భాల్లో బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా ఆయన ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వరూపం' విడుదల సమయంలో ఎదురైన రాజకీయ, సెన్సార్ ఆంక్షలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుడి భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడం ప్రజాస్వామ్యానికే విఘాతమని కమల్ వాదించారు. సెన్సార్ బోర్డ్ అనేది కేవలం సినిమాలకు సర్టిఫికేట్ ఇచ్చే సంస్థగా మాత్రమే పనిచేయాలి తప్ప... సన్నివేశాలను కత్తిరించే హక్కు దానికి ఉండకూడదనేది కమల్ హాసన్ బలమైన వాదన.
అనురాగ్ కశ్యప్:
బాలీవుడ్‌లో సెన్సార్ బోర్డ్‌తో అత్యధికంగా తలపడిన దర్శకులలో అనురాగ్ కశ్యప్ అగ్రస్థానంలో ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన బ్లాక్ ఫ్రైడే, ఉడ్తా పంజాబ్ చిత్రాల విడుదల సమయంలో అప్పటి సెన్సార్ బోర్డ్ విధించిన అన్యాయమైన కత్తెర్లపై ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. సెన్సార్ బోర్డ్ అనేది రాజకీయం, కపటత్వంతో నిండిపోయిందని అది సినిమా సృజనాత్మకతను చంపేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్మ అన్నట్లే.. ఇండస్ట్రీ లొంగిపోకుండా తన హక్కుల కోసం పోరాడాలని అనురాగ్ ఎప్పుడూ గళం విప్పుతూనే ఉంటారు.
శేఖర్ కపూర్:
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన దర్శకుడు శేఖర్ కపూర్ తన క్లాసిక్ చిత్రం 'బాండిట్ క్వీన్' రిలీజ్ సమయంలో సెన్సార్ బోర్డ్‌తో పెద్ద పోరాటమే చేశారు. సమాజంలోని నగ్న సత్యాలను, హింసను తెరపై చూపిస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం అంటే సమాజంలో ఉన్న వాస్తవాలను దాచడమేనని ఆయన వాదించారు. సెన్సార్ బోర్డ్ సభ్యులకు కళపై గానీ, సినిమా పరిజ్ఞానంపై గానీ కనీస అవగాహన ఉండదని.. అలాంటి వారు సినిమాను జడ్జ్ చేయడం హాస్యాస్పదమని ఆయన పలుమార్లు విమర్శించారు. రేటింగ్‌ల వ్యవస్థను తీసుకురావాలే తప్ప కట్స్ విధించకూడదని కపూర్ జీ కోరుకున్నారు.
ప్రకాష్ రాజ్:
బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాకుండా సామాజిక వేదికలపై కూడా సెన్సార్ బోర్డ్ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. సిద్ధాంతాల పేరుతో, భావజాలాల పేరుతో సినిమాల్లోని సంభాషణలను కట్ చేయడం అనేది పరోక్షంగా ప్రేక్షకుల ఆలోచనా శక్తిని తక్కువ చేసి చూడటమేనని అభిప్రాయపడ్డారు. సమాజంలో అన్ని రకాల కంటెంట్ విచ్చలవిడిగా దొరుకుతున్నప్పుడు.. కేవలం సినిమా రంగాన్ని మాత్రమే సాఫ్ట్ టార్గెట్ చేయడం వెనుక ఉన్న బ్యూరోక్రసీ మైండ్‌సెట్‌ను విలక్షణ నటుడు తీవ్రంగా తప్పుబట్టారు.