అమీర్ ఖాన్ పెళ్లి చెల్ల‌దు.. ముస్లిమ్ మ‌త‌గురువు ఫ‌త్వా జారీ

అంతేకాకుండా.. ముస్లిమేతర మహిళలను వివాహం చేసుకునే ముస్లింలు పాపం చేస్తున్నట్లేనని.. ఇలాంటి వివాహాలను ఇస్లామిక్ చట్టం ప్రకారం.. తాము ఆమోదించబోమని ఆ ముఫ్తీ స్పష్టం చేశారు.

Update: 2026-07-15 08:37 GMT

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవలే తన దీర్ఘకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను రిజిస్టర్డ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ‌తాంత‌ర‌ వివాహం (ఇంటర్‌ఫెయిత్ మ్యారేజ్)పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ముస్లిం మత గురువు అమీర్ ఖాన్‌పై ఫత్వా జారీ చేసినట్లు జాతీయ మీడియాలు త‌మ క‌థ‌నాల్లో పేర్కొంటున్నాయి. మతపరమైన నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ప్ర‌ముఖ జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ వివాహంపై స్పందించారు. గౌరీ స్ప్రాట్ ముస్లిం కానందున.. షరియా చట్టాల ప్రకారం అమీర్ ఖాన్ చేసుకున్న ఈ మూడవ వివాహం చెల్లదని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఆ మత గురువు మాట్లాడిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఒక ముస్లిం పురుషుడు ముస్లిమేతర స్త్రీని వివాహం చేసుకోవడం ఇస్లామిక్ చట్టాల ప్రకారం నిషిద్ధమని (హరామ్) పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ముస్లిమేతర మహిళలను వివాహం చేసుకునే ముస్లింలు పాపం చేస్తున్నట్లేనని.. ఇలాంటి వివాహాలను ఇస్లామిక్ చట్టం ప్రకారం.. తాము ఆమోదించబోమని ఆ ముఫ్తీ స్పష్టం చేశారు. ఈ చర్యలను పాపంగా అంగీకరించని వారు చివరికి అల్లాహ్‌కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని మ‌త గురువు వ్యాఖ్యానించారు. నటుడు అమీర్ ఖాన్ విషయానికి వస్తే... ఆయన ఇటీవలే ఒక ముస్లిమేతర మహిళను మూడవ వివాహం చేసుకున్నారని... దీనిపై సమాజంలో నిరసనలు వ్యక్తమవడాన్ని తాము గమనించామని కూడా మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పెళ్లిళ్లు... విడాకులు.. పునర్వివాహాల బాధ్యతలపై కూడా మ‌త గురువు మాట్లాడారు. ఒక వ్యక్తి పెళ్లి వల్ల వచ్చే బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు.. మరొక వివాహం చేసుకోకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ముస్లిమేతర మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే తప్ప ఒక ముస్లిం పురుషుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే తనపై వచ్చిన ఈ ఫత్వా లేదా మత పెద్దల వ్యాఖ్యలపై నటుడు అమీర్ ఖాన్ గానీ.. ఆయన భార్య గౌరీ స్ప్రాట్ గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించ‌లేదు.

అమీర్ ఖాన్ గత వివాహాల విషయానికి వస్తే.. అత‌డు మొదట రీనా దత్తాను వివాహం చేసుకోగా వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 16 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకుని.. 2011లో సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్‌కు జన్మనిచ్చారు. 2021లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించినా తమ కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 5 జూలై 2026న ముంబైలోని తన నివాసంలో అమీర్ ఖాన్ అత్యంత సన్నిహితుల మధ్య 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' కింద గౌరీ స్ప్రాట్‌ను మూడవ వివాహం చేసుకున్నారు.

ఒక హిందూ యువ‌తిని అమీర్ ఖాన్ వివాహం చేసుకోవ‌డంపై సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చ నడుస్తోంది. అమీర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు తీవ్రంగా విమ‌ర్శిస్తుండ‌గా.. వివాహాలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం -వరుస పెళ్లిళ్ల అంశాలపై మతపరమైన కోణంలో నెటిజ‌నుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News