వారణాసి : 24 ఏళ్లలో ఇదే స్పెషల్
ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ప్రారంభం అయ్యి 24 ఏళ్లు దాటింది. ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా స్పెషల్ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని జక్కన్న తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా అయినా, మొత్తంగా 2027లో సినిమాను కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం దర్శకుడు రాజమౌళి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రాజమౌళి సినిమా అంటేనే అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈసారి హాలీవుడ్ రేంజ్ అంటూ మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా...
వారణాసి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన పీసీ గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్‌లో మాత్రమే సినిమాలు, సిరీస్‌లు చేస్తూ వస్తుంది. దాదాపు ఎనిమిది ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాలో నటిస్తుంది. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. పూర్తిగా హాలీవుడ్‌కి పరిమితం అవుతుందని భావించిన ప్రియాంక చోప్రాను రాజమౌళి తన కథతో మెప్పించి, తన మేకింగ్ పై ఆసక్తి కలిగించి ఇండియన్ సినిమాలో నటించేలా చేశాడు. వారణాసి తర్వాత మళ్లీ ఇండియన్ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ వారణాసి సినిమా గురించి ఎంత వరకు నోరు విప్పాలో అంత వరకు నోరు విప్పింది. సినిమాకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి వారణాసి...
ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసే స్లో మోషన్ జంప్స్ అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ సైతం చేశాం. తప్పకుండా మీ అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ప్రారంభం అయ్యి 24 ఏళ్లు దాటింది. ఇన్నాళ్ల సినీ కెరీర్‌లో చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా స్పెషల్ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లోనే ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా ప్రియాంక పేర్కొనడం చూస్తే సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రియాంక చోప్రా ఈ 24 ఏళ్లలో ఎన్నో హిందీ సినిమాలతో పాటు సౌత్‌లోనూ అలరించింది. ఇక హాలీవుడ్ సినిమాల్లోనూ ఈమె నటించిన విషయం తెల్సిందే. అయినా కూడా ఈ సినిమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన మూవీ అనడంతో వారణాసి సినిమా స్థాయి మరింత పెరిగిందని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మహేష్ బాబు వారణాసి సినిమా విడుదల...
రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈసారి అంతకు మించి అని, హాలీవుడ్ సినిమాలను మించి యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, డ్రామా, గ్రాఫిక్ వర్క్ ఉంటుందనే నమ్మకంను మహేష్ బాబు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో నిలిచి పోయే సినిమాగా వారణాసి నిలువబోతుంది. రాజమౌళి ఏ సినిమా చేసినా ఆయా హీరోలకు, హీరోయిన్స్‌కి కెరీర్‌లో నిలిచి పోయే సినిమా, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అన్నట్లుగా ఆ సినిమాలు ఉంటాయి. వారణాసి సినిమా సైతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అన్నట్లు నిలవడం ఖాయం. సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా ఇప్పటి వరకు కథ, కథనం విషయంలో క్లారిటీ రాలేదు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ సినిమా వివిధ టైమ్ జోన్స్‌లో, వివిధ దేశాల్లో సాగుతుందని చెప్పుకొచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా వారణాసి నుంచి ఏం అప్‌డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.