నోలన్ 'ది ఒడిస్సీ' రికార్డ్ : ఇండియా టాప్-10లో నిలుస్తుందా?

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ `ది ఒడిస్సీ` భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.

Update: 2026-07-15 11:30 GMT

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. భారతదేశంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో దీని ఓపెనింగ్స్ గురించి భారీ చర్చ నడుస్తోంది. హాలీవుడ్ చిత్రాలకు ఇక్కడ ఉన్న క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తూ ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా 20 కోట్ల ఓపెనింగ్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక హాలీవుడ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తే... అది బాలీవుడ్ అగ్ర హీరోలైన ఖాన్‌ల సినిమాల ఓపెనింగ్ రికార్డులను కూడా సవాలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ అద్భుతమైన క్రేజ్‌కు తగ్గట్టుగానే 'ది ఒడిస్సీ' చిత్రం భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదల కాబోతోంది. నోలన్ చిత్రాలను థియేటర్లలో ముఖ్యంగా ఐమాక్స్ (IMAX) స్క్రీన్లపై చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకు నిదర్శనంగా ప్రపంచంలోనే పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ కావడంతో దీనికి అసాధారణమైన డిమాండ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం ఇండియాలోని 34 ఐమాక్స్ స్క్రీన్లలోనే 91000 టిక్కెట్లు అమ్ముడై, 9.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం ఒక సంచలనంగా నిలిచింది.

క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రం ఒపెన్‌హైమర్ (2023) భారతదేశంలో 14.45 కోట్ల ఓపెనింగ్‌తో భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆ చిత్రం 1923 స్క్రీన్లలో విడుదల కాగా.. 'ది ఒడిస్సీ' మాత్రం 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లతో ఆ రికార్డును సులభంగా అధిగమించనుంది. ప్రస్తుత బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం... ఈ సినిమా మొదటి రోజు కనీసం 17 నుండి 18 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మునుముందు అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పుంజుకుంటే, తొలిరోజే 20 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒకవేళ 'ది ఒడిస్సీ' ఆశించిన విధంగా 20 కోట్ల మార్కును చేరితే... ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్-10 హాలీవుడ్ చిత్రాల జాబితాలోకి ఇది నేరుగా ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో హాలీవుడ్ ఓపెనింగ్స్ పరంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ -53.10 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, అవతార్: ది వే ఆఫ్ వాటర్ -40.00 కోట్ల ఓపెనింగులతో రెండో స్థానంలో నిలిచింది. వాటితో పాటు స్పైడర్-మాన్: నో వే హోమ్ -32.67 కోట్లు, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ -31.30 కోట్లు, డాక్టర్ స్ట్రేంజ్ 2 -28.35 కోట్లు, అవతార్ 3 -22.00 కోట్లు, డెడ్‌పూల్ & వోల్వరీన్- 21.00 కోట్లతో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ది ఒడిస్సీ 20 కోట్ల వసూళ్లతో 8వ స్థానంలో ఉన్న `మిషన్ ఇంపాజిబుల్ 8-18.89 కోట్లు ... 9వ స్థానంలో ఉన్న `థోర్: లవ్ అండ్ థండర్` (18.20 కోట్లు)ల రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

2026 జూలై నెల ఇండియా బాక్సాఫీస్ ఎగ్జిబిటర్లకు ఒక పండగలా మారబోతోంది. ఇప్పటికే విడుదలైన వెల్ కం టు ది జంగిల్ విజ‌యం త‌ర్వాత 'ధమాల్ 4' అంచనాలకు మించి అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుండగా, ఇప్పుడు 'ది ఒడిస్సీ' భారీ అడ్వాన్స్ సేల్స్‌తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రేజ్ ఇలాగే కొనసాగిస్తూ జూలై నెలాఖరున రానున్న 'స్పైడర్-మాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం కూడా భారీ వసూళ్లతో అలరించడానికి సిద్ధమవుతోంది. మొత్తానికి క్రిస్టోఫర్ నోలన్ `ది ఒడిస్సీ` చిత్రం ద్వారా భారతీయ చిత్రసీమలో హాలీవుడ్ స్థాయిని.. క్రేజ్‌ను మరో మెట్టు ఎక్కించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌లి కాలంలో ఖాన్ ల సినిమాలు 20 కోట్ల ఓపెనింగులు సాధించ‌డంలో త‌డ‌బ‌డుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఒక హాలీవుడ్ సినిమా ఈ స్థాయి వ‌సూళ్ల‌ను సాధించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Tags:    

Similar News