థియేట్రికల్ రన్ వ‌ర్సెస్ ఓటిటి!

ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ అనుభవం మాత్రమే. కానీ ఓటిటి వేదికల రాకతో ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.;

Update: 2026-04-24 17:29 GMT

ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ అనుభవం మాత్రమే. కానీ ఓటిటి వేదికల రాకతో ఆ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓటిటి హవా ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా మంది నిర్మాతలు థియేట్రికల్ రెవెన్యూను సెకండ్ ఆప్షన్‌గా భావించే పరిస్థితి ఏర్పడింది. డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రాజెక్టుల బడ్జెట్లు ఆధార‌ప‌డ‌టం ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్‌కు దారితీసింది. గతంలో ఒక సినిమా బడ్జెట్‌లో దాదాపు సగం వాటా సాటిలైట్ రైట్స్ , ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా రికవరీ అయ్యేది.

దీంతో నిర్మాతలకు ఒక రకమైన ఆర్థిక భద్రత ఉండేది. అయితే ఇప్పుడా పరిస్థితి భిన్నంగా ఉంది. ఓటిటి సంస్థలు స్టార్ డమ్ చూసి కాకుండా వ్యూయర్‌షిప్ డేటా , ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ప్రేక్షకులు ఏ తరహా కంటెంట్‌ను ఇష్టపడుతున్నారో విశ్లేషించి దానికి అనుగుణంగానే రేట్లను ఫిక్స్ చేస్తున్నాయి. దీంతో కంటెంట్ లేని సినిమాలకు డిజిటల్ మార్కెట్లో కూడా గడ్డు కాలం నడుస్తోంది. ఈ మార్పుల వల్ల మేకర్స్ మళ్ళీ ప్రాథమిక సూత్రాల వైపు మ‌ళ్ల‌క తప్పడం లేదు. ప్రేక్షకులను ఇళ్ల నుండి బయటకు రప్పించి థియేటర్ల వరకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న కంటెంట్‌పైనే దర్శకులు, నిర్మాతలు దృష్టి సారిస్తున్నారు.

కేవలం ఓటిటిని నమ్ముకుని సినిమాలు తీస్తే లాభం లేదని థియేటర్లలో ఆడియన్స్ ఇచ్చే తీర్పు మాత్రమే సినిమా అసలు విజయాన్ని నిర్ణయిస్తుందని గ్రహిస్తున్నారు. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విజువల్స్, ఎమోషన్స్ ఉన్న సినిమాలకే బాక్సాఫీస్ వద్ద ఆదరణ లభిస్తోంది. ట్రేడ్ అంచ‌నా ప్ర‌కారం బాలీవుడ్ తరహాలో థియేట్రికల్ రన్‌ను మళ్ళీ మెయిన్ పిల్లర్ గా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటిటి అనేది అదనపు ఆదాయ వనరుగా ఉండాలి తప్ప అదే ప్రధాన వనరు కాకూడదు. సినిమా విడుదలైన మొదటి రెండు మూడు వారాలు థియేటర్లలో సాధించే వసూళ్లే ఇండస్ట్రీ మనుగడకు ప్రాణం లాంటింది. థియేటర్ వ్యవస్థ బలంగా ఉంటేనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , ఇతర సినీ కార్మికులు లబ్ధి పొందుతారు. ఇది మొత్తం చిత్ర పరిశ్రమ ఆర్థిక చక్రానికి ఎంతో కీలకం.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న సినిమాలు ఓటిటిని ఆసరాగా చేసుకుంటున్నా? పెద్ద సినిమాలు మాత్రం థియేటర్ విండోను కాపాడుకోవాల్సి ఉంది. సినిమా విడుదలైన వెంటనే ఓటిటిలో వచ్చేస్తుందనే భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోవడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ గ్యాప్‌ను పెంచడం ద్వారా ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. థియేట్రికల్ రన్‌కు ప్రాధాన్యత ఇస్తేనే పంపిణీ వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది. టాలీవుడ్‌కు మళ్ళీ గోల్డెన్ డేస్ రావాలంటే థియేటర్ అనుభవాన్ని మించిన వినోదాన్ని మేకర్స్ అందించాలి. ఓటిటి సంస్థల మారుతోన్న నిబంధనలు కూడా పరోక్షంగా క్వాలిటీ కంటెంట్ రావడానికి దోహదపడుతున్నాయి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా? వెండితెరపై సినిమా చూడటం ఇచ్చే అనుభూతి అద్వితీయం. ఆ అనుభూతిని నమ్ముకుని సినిమాలు తీస్తేనే తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్వ వైభవాన్ని నిలబెట్టుకోగలద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News