ఫాంటసీల‌తో గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసిన యంగ్ డైరెక్టర్స్!

ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చందు లక్ష్యంగా పెట్టుకున్నట్లు క‌నిపిస్తుంది.;

Update: 2026-04-23 17:30 GMT

టాలీవుడ్ సినిమా స్థాయి ఇప్పుడు ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తమైంది. ముఖ్యంగా నేటి తరం యంగ్ డైరెక్టర్లు పురాణాలను, ఇతిహాసాలను ఆధునిక సాంకేతికతతో జోడించి ఫాంటసీ కథలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. భార‌తీయ‌ మూలాలు ఆధారంగా గ్లోబల్ మార్కెట్‌ను ఆకట్టుకునేలా చేస్తోన్న‌ ప్రయత్నాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ తరహా ట్రెండ్‌కు `కార్తికేయ 2`తో చందు మొండేటి బలమైన పునాది వేశారు. ద్వారకా నగరం , కృష్ణ తత్వం నేపథ్యంలో సాగే ఈ చిత్రం హిందీ బెల్ట్‌లో ఊహించని విజయాన్ని అందుకుంది.

ఎలాంటి భారీ ప్రమోషన్లు లేకుండానే కేవలం కంటెంట్‌తో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడం చిన్న విషయం కాదు. పురాణాల్లోని నిగూఢ సత్యాలను సైన్స్‌తో ముడిపెడుతూ చందు మొండేటి చెప్పిన విధానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ల ఆలోచనా దృక్పథంలో విప్లవాత్మక మార్పుకు దారితీసింది.

అటుపై ప్రశాంత్ వర్మ `హనుమాన్` చిత్రంతో ఈ ట్రెండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌కు హనుమంతుడి శక్తులను జోడించి సృష్టించిన విజువల్ వండర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

తక్కువ బడ్జెట్‌తోనే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అందించొచ్చ‌ని ప్రశాంత్ నిరూపించాడు. ఒక సినిమాతోనే ఆగకుండా `పివిసియు` పేరిట ఒక పెద్ద ఫాంటసీ ప్రపంచాన్నే ఆయన సృష్టించ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. తాజాగా చందు మొండేటి మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. రానా దగ్గుబాటి - బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా ఉజ్జయిని మహాకాళేశ్వరుని నేపథ్యంలో ఒక భారీ ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్వారా భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చందు లక్ష్యంగా పెట్టుకున్నట్లు క‌నిపిస్తుంది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ తోడవడంతో సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాధారణంగా ఫాంటసీ సినిమాలంటే గ్రాఫిక్స్ పనుల కోసం ఏళ్ల తరబడి సమయం పడుతుంది. కానీ నేటి దర్శకులు పక్కా ప్లానింగ్‌తో తక్కువ సమయంలోనే క్వాలిటీ అవుట్‌పుట్‌ను ఇస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని `మిరాయి` వంటి చిత్రంతో ఈ జాబితాలో చేరిన సంగ‌తి తెలిసిందే. విదేశీ సూపర్ హీరో కథలను చూసి మురిసిపోయే మన ప్రేక్షకులకు, మన సొంత పురాణ గాథలను అదే రేంజ్‌లో చూపించడం వల్ల కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలు గ్లోబల్ మార్కెట్‌లో కూడా సత్తా చాటుతున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లు కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా మన సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్‌గా మారుస్తున్నారు.

పురాణాలకు ఆధునిక టచ్ ఇచ్చి చేస్తోన్న‌ ప్రయోగాలు భారతీయ సినిమా భవిష్యత్తును మార్చబోతున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం. విజువల్ ఎఫెక్ట్స్ , బలమైన కథా బలంతో వ‌స్తోన్న‌ ఫాంటసీ చిత్రాలు హాలీవుడ్‌కు సైతం గట్టి పోటీనిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ రేసులో మ‌హ‌ష్ -రాజ‌మౌళి వార‌ణాసి నిలుస్తుంది. ఈ సినిమా విజువ‌ల్ మాయాజాలం ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచుతుంద‌ని అంతా భావిస్తున్నారు . 120 దేశాల్లో రిలీజ్ అవుతోన్న `వార‌ణాసి` గ్లోబ‌ల్ స్థాయిలో స‌క్సెస్ అయిందంటే? తెలుగు సినిమా హాలీవుడ్ కు పోటీగా త‌యారైన‌ట్లే.

Tags:    

Similar News