భారీ చిత్రాల సీక్వెల్స్ పై క్లారిటీ!
ప్రస్తుతం ఫ్రాంచైజీలు, సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా మరో భాగాన్ని తీసుకురావడం సర్వ సాధారణగా మారింది.
ప్రస్తుతం ఫ్రాంచైజీలు, సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా మరో భాగాన్ని తీసుకురావడం సర్వ సాధారణగా మారింది. అయితే మొదటి భాగం సాధించిన రికార్డులను క్యాష్ చేసుకోవడమే టార్గెట్ గా కాకుండా కథలో బలం ఉంటేనే ముందుకు వెళ్లాలనే సరికొత్త ఆలోచనా విధానం పరిశ్రమలో కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పలు భారీ చిత్రాల సీక్వెల్స్ ప్రకటనలు, మేకర్స్ ఇస్తోన్న వివరణలు విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నా? తదుపరి భాగాలపై దర్శక- హీరోలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
`లోకా చాప్టర్ 2` గురించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్ర మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో పార్ట్ 2పై అంచనాలు ఆకాశన్నంటతున్నాయి. ఆసినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి హైప్ ఉన్నప్పుడు సాధారణంగా సీక్వెల్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని మేకర్స్ భావిస్తుంటారు. కానీ ఈ చిత్ర బృందం మాత్రం ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా తాము ముందుగా అనుకున్న కథా గమనం ప్రకారమే స్క్రిప్ట్ పనులతో ముందుకు వెళ్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. సినిమా విజయంతో సంబంధం లేకుండా అనుకున్న కంటెంట్‌పైనే పూర్తి దృష్టి పెట్టడం వారి వృత్తిపరమైన నిబద్ధతకు అద్దం పడుతోంది.
అలాగే యూత్ -ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన `ప్రేమలు` చిత్ర సీక్వెల్‌పైనా స్పష్టత వచ్చింది. ఈ సినిమా సాధించిన సంచలన విజయం తర్వాత `ప్రేమలు 2` కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఈ చిత్రానికి సీక్వెల్ సాధ్యం కాదని ఆ సినిమా హీరో స్పష్టం చేశారు. మొదటి భాగం తెచ్చిన క్రేజ్‌ను వాడుకుని కేవలం బిజినెస్ కోసం సినిమా తీయడం తమకు ఇష్టం లేదని.. పక్కాగా సరిపోయే పర్‌ఫెక్ట్ కథ కుదిరితేనే ద్వితీయ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పడం కథ పట్ల వారికి ఉన్న గౌరవాన్ని నిరూపిస్తోంది.
ఇదే తరహా అభిప్రాయాన్ని ప్యాన్-ఇండియా స్థాయి క్రేజ్ ఉన్న `కేజీఎఫ్ 3` - `లియో 2` చిత్రాల విషయంలోనూ హీరోలు కనిపిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యష్ `కేజీఎఫ్ 3` ఇప్పట్లో ఉండే అవకాశం లేదని చాలా ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చారు. రాకీ భాయ్ పాత్రపై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాలను అందుకోవాలంటే మరింత సమయం, బలమైన సబ్జెక్ట్ అవసరమని ఆయన భావిస్తున్నారు. అలాగే దళపతి విజయ్ నటించాల్సిన `లియో 2` ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతానికి పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ భారీ చిత్రాల హీరోలు తదుపరి భాగాల విషయంలో తొందర పడకుండా సుదీర్ఘ విరామం అనంతరమే మొదలవుతాయి.
పరిశ్రమలో ఈ తరహా మార్పు రావడం మంచిదే. నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ కంటెంట్‌ను చాలా నిశితంగా గమనిస్తున్నారు. సరైన కథ లేకుండా కేవలం బ్రాండ్ ఇమేజ్‌తో వచ్చే సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్న ఉదాహరణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ - నటీనటులు కలెక్షన్ల కోసం కాకుండా ఫ్రాంచైజీల నైతిక విలువను, క్రేజ్‌ను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీ చిత్రాల సీక్వెల్స్ ఆలస్యమైనా పర్వాలేదు. కానీ అత్యుత్తమ క్వాలిటీతో రావాలనే మేకర్స్ ఆలోచన సినిమా రంగానికి ఎంతో శుభపరిణామం.