బాక్సాఫీస్ మ‌హారాణులు ఈ టాప్ -10 హీరోయిన్లు

భారతీయ సినీ రంగంలో మహిళా నటీమణుల ప్రాముఖ్యత గత పదేళ్లలో సరికొత్త రూపురేఖ‌ల్ని సంత‌రించుకుంది.

Update: 2026-08-19 07:14 GMT

భారతీయ సినీ రంగంలో మహిళా నటీమణుల ప్రాముఖ్యత గత పదేళ్లలో సరికొత్త రూపురేఖ‌ల్ని సంత‌రించుకుంది. ఒకప్పుడు కేవలం కథానాయకుడి పాత్రకు గ్లామర్ జోడించి అదనపు మైలేజీగా సాయ‌ప‌డ‌తార‌ని భావించిన‌ హీరోయిన్లు.. నేడు సోలో నాయిక‌లుగాను వంద‌ల‌ కోట్ల రూపాయల బిజినెస్ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ సినిమా విజయాల్లో కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారు. అదే స‌మ‌యంలో క‌థానాయ‌కుడికి స‌రిజోడుగా క‌థానాయిక సినిమా విజ‌యంలో కీల‌కంగా మారుతున్నారు. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, ఫాతిమా సనా షేక్ ఒక ముఖ్య పాత్ర‌లో నటించిన `దంగల్` ప్రపంచవ్యాప్తంగా 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం.. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో మెరిసిన బాహుబలి 2 (ప్ర‌భాస్ క‌థానాయ‌కుడు) చిత్రం 1,800 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం వంటి స‌న్నివేశాలు భారతీయ చిత్రసీమలో నటీమణుల స్టామినాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. స్టార్ హీరోకి స‌రిజోడు కూడా కుదిరితే క‌లెక్ష‌న్లు పెరుగుతాయ‌ని ప్రూవైంది.

ఈ భారీ వసూళ్ల పరంపర ఒక్క ప్రాంతీయ రంగానికో లేదా భాషకో పరిమితం కాలేదు. పుష్ప 2తో రష్మిక మందన్న 1350 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆలియా భట్ 1300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమా- ఆర్.ఆర్.ఆర్ లో నాయిక‌గా న‌టించారు. బాలీవుడ్ అగ్రకథానాయకి దీపికా పదుకొణె నటించిన పఠాన్ 1050 కోట్ల మార్కును అందుకోగా.. శ్రద్ధా కపూర్ స్త్రీ 2 (దాదాపు 900 కోట్లు), కరీనా కపూర్ బజరంగీ భాయిజాన్ (దాదాపు 920 కోట్లు), అనుష్క శర్మ పికె (దాదాపు 770 కోట్లు) చిత్రాలు పాన్-ఇండియా వ్యాప్తంగా కథానాయికల ఇమేజ్ బాక్సాఫీస్‌పై ఎంతటి ప్రభావం చూపుతుందో స్పష్టం చేశాయి.

ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన ధురంధర్ ఫ్రాంచైజీ కథానాయిక ఏకంగా 3,000 కోట్ల వ‌సూళ్లు సాధించిన బంప‌ర్ హిట్టులో భాగమైంది. ఈ రికార్డు సినీ విశ్లేషకులను సైతం విస్తుపోయేలా చేసింది. ధురంధర్ మొదటి భాగం అంతర్జాతీయంగా 1307 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. దాని సీక్వెల్ ధురంధర్ 2 ఏకంగా 1,700 కోట్లకు పైగా సాధించి రెండు భాగాల ఉమ్మడి కలెక్షన్లలో 3,019 కోట్ల రికార్డును నెలకొల్పింది. దీంతో ఈ చిత్ర కథానాయిక సారా అర్జున్.. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా 3000 కోట్ల ఫ్రాంచైజీ క్లబ్‌లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలైన హీరోయిన్‌గా నిలిచారు.

బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే.. ధురంధర్ సాధించిన ఈ 3000 కోట్ల ఫ్రాంచైజీ రికార్డు అంతకుముందు మైలురాళ్లుగా నిలిచిన బాహుబలి సిరీస్ (రెండు భాగాలకు కలిపి 2,438 కోట్లు), పుష్ప సిరీస్ (రెండు భాగాలకు కలిపి 2,221 కోట్లు) మొత్తం వసూళ్లను అధిగమించడం విశేషం. భారతీయ సినిమాలో రెండు వరుస చిత్రాలతో ఉమ్మడిగా 3,000 కోట్ల మైలురాయిని దాటిన తొలి ఫ్రాంచైజీగా ఇది నిలవడమే కాకుండా.. పెద్ద బడ్జెట్ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ కు ఎంత గొప్ప ఖ్యాతి ద‌క్కుతుందో నిరూపించింది. సారా అంద‌చందాలు, న‌ట ప్ర‌తిభ ఈ సినిమాకి ప్ల‌స్ అయ్యాయి.

నేటితరం కథానాయికలు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. కథలోని భావోద్వేగాలకు.. డ్రామాను న‌డిపించ‌డానికి ప్రధాన బలంగా మారుతున్నారు. దీపికా పదుకొణె, అనుష్క శెట్టి నుంచి నేటి రష్మిక మందన్న, సారా అర్జున్ వరకు ఈ నటీమణులు సాధిస్తున్న రికార్డులు భారతీయ సినిమా ప్రపంచ మార్కెట్ పరిధిని విస్తరించడమే కాకుండా భవిష్యత్ కథానాయిక ఆధారిత బిగ్-బడ్జెట్ చిత్రాలకు బలమైన పునాదిని వేస్తున్నాయి.

Tags:    

Similar News