మోక్షజ్ఞ.. అలసిపోయిన ఆశలు

మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఒకప్పుడు నందమూరి ఫ్యాన్స్ గట్టిగానే ఎదురుచూశారు. బాలయ్య కొడుకు ఎప్పుడు వస్తాడు, ఎవరు లాంచ్ చేస్తారు అంటూ ప్రతి చిన్న వార్తకూ మంచి సౌండ్ ఉండేది.

Update: 2026-08-19 07:13 GMT

మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఒకప్పుడు నందమూరి ఫ్యాన్స్ గట్టిగానే ఎదురుచూశారు. బాలయ్య కొడుకు ఎప్పుడు వస్తాడు, ఎవరు లాంచ్ చేస్తారు అంటూ ప్రతి చిన్న వార్తకూ మంచి సౌండ్ ఉండేది. ఇప్పుడు మాత్రం కొత్త దర్శకుడి పేరు వినిపించినా ఆ ఉత్సాహం అంతగా కనిపించడం లేదు. సినిమా ప్రకటిస్తే చూద్దాం.. సెట్స్ మీదకు వెళ్తే నమ్ముదాం అనే స్థాయికి విషయం వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలుగా డెబ్యూ వార్తలు వింటూ ఉండటంతో ఫ్యాన్స్ ఆశల్లో కూడా కాస్త అలసట వచ్చినట్టే కనిపిస్తోంది.

నిజానికి ప్రశాంత్ వర్మ సినిమాతో ఆ ఎదురుచూపులు ముగిశాయనే అనుకున్నారు. 2024లో మోక్షజ్ఞ పుట్టినరోజునే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. తర్వాత జరగాల్సిన లాంచ్ వాయిదా పడింది. ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వచ్చినప్పుడు నిర్మాతలు ఒక దశలో వాటిని ఖండించారు కూడా. కానీ 2026కి వచ్చేసరికి ఆ సినిమా ముందుకు వెళ్లడం లేదనే రిపోర్ట్స్ వచ్చాయి. పోస్టర్ వరకు వచ్చిన సినిమా కూడా ఇలా ఆగిపోవడంతోనే తర్వాతి వార్తలపై నమ్మకం తగ్గింది.

మధ్యలో బాలకృష్ణ స్వయంగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ గురించి మాట్లాడటంతో మోక్షజ్ఞ ఎంట్రీకి మరో దారి కనిపించింది. ఆ ప్రాజెక్ట్‌లో తన కుమారుడు ఉంటాడని చెప్పడంతో ఇదే తొలి సినిమా అవుతుందేమో అనుకున్నారు. కానీ అది కూడా ఇప్పటివరకు షూటింగ్ దశకు చేరలేదు. ఇప్పుడు మళ్లీ వశిష్ఠ పేరు వినిపిస్తోంది. ఆయన మోక్షజ్ఞకు కథ చెప్పినట్లు గతంలోనే రిపోర్ట్స్ వచ్చాయి. ప్రస్తుతం ‘విశ్వంభర’ పనుల్లో ఉన్న వశిష్ఠతోనే డెబ్యూ కుదిరే అవకాశం ఉందనే ప్రచారం మళ్లీ మొదలైంది.

కాంబినేషన్ వినడానికి బాగానే ఉంది. కానీ మోక్షజ్ఞ విషయంలో ఇప్పుడు దర్శకుడి పేరు ఎంత పెద్దదన్నది కూడా రెండో విషయమే. ముహూర్తం జరిగి, కెమెరా ఆన్ అయ్యే వరకు ఫ్యాన్స్ లో చలనం వచ్చేలా కనిపించడం లేదు. మోక్షజ్ఞకు ఇప్పుడు 31 ఏళ్లు. స్టార్ వారసుల డెబ్యూ సాధారణంగా చాలా ముందే ప్లాన్ అవుతుంది. ఇక్కడ మాత్రం సంవత్సరాలు గడుస్తున్నా మొదటి సినిమా ఏదో కూడా ఇంకా ఫిక్స్ కాలేదు.

పైగా మోక్షజ్ఞ కూడా మీడియా ముందు పెద్దగా కనిపించడం లేదు. సినిమాలపై తన ప్లాన్ ఏంటి, ఎలాంటి కథతో రావాలనుకుంటున్నాడు అనే విషయం ఆయన నుంచి నేరుగా వినిపించలేదు. అందుకే అసలు ఆయనకు నటనపై ఎంత ఆసక్తి ఉందనే డౌట్ కూడా అప్పుడప్పుడు రావడం సహజమే. ఏదేమైనా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెగ్యులర్ అప్డేట్స్ వస్తె తప్ప మోక్షజ్ఞ డెబ్యూపై మళ్లీ నిజమైన హైప్ మొదలయ్యేలా లేదు. అప్పటివరకు కొత్త దర్శకుడి పేరు వచ్చిన ప్రతిసారీ ఆశపడటం కంటే.. సినిమా మొదలయ్యే రోజు కోసం ఎదురుచూడటమే నందమూరి ఫ్యాన్స్‌కు అలవాటైపోయినట్టుంది.

Tags:    

Similar News