ప్ర‌భాస్ మానియా: 1000 కోట్లు వ‌స్తే 70 శాతం మ‌హిళా ఫ్యాన్స్ నుంచే!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), శోభన్ బాబులకు మహిళా ఫ్యాన్స్ ఏ స్థాయిలో నిధిలా ఉండేవారో ప్రత్యేకంగా చర్చించేవారు.

Update: 2026-10-23 14:08 GMT

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ నటించిన‌ సినిమాలకు వచ్చే వసూళ్లలో సింహభాగం మహిళా ప్రేక్షకులతోనే ముడిపడి ఉంటుందంటే అతిశ‌యోక్తి కాదు. ఒక అంచనా ప్రకారం ప్రభాస్ సినిమాకి 1000 కోట్లు వస్తే.. అందులో దాదాపు 70శాతం మహిళా ఫ్యాన్స్ నుంచే క‌లెక్ష‌న్స్ వస్తాయంటే అతిశయోక్తి కాదు. ఆరడుగుల ఆజానుబాహుడైన రూపం.. సాఫ్ట్ అండ్ లవబుల్ నేచర్.. డార్లింగ్ అనే పిలుపుతో అత‌డు సంపాదించుకున్న మ‌హిళా ఫ్యానిజం ఎప్పటికీ తరగని నిధిలాంటిది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), శోభన్ బాబులకు మహిళా ఫ్యాన్స్ ఏ స్థాయిలో నిధిలా ఉండేవారో ప్రత్యేకంగా చర్చించేవారు. శోభన్ బాబు అంటేనే మహిళా ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడేవారు. ఆ తరహా అరుదైన, తిరుగులేని లేడీ ఫాలోయింగ్‌ను ప్రస్తుత తరంలో సంపాదించుకున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. అత‌డి ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్.. కుటుంబ కథా చిత్రాలైనా.. మాస్ యాక్షన్ సినిమాలైనా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తాయి.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా - యూట్యూబ్ ఛానెళ్ల సర్వేలలో ప్రభాస్‌కు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో స్పష్టంగా బయటపడింది. అత‌డి స్ట్రెయిట్ సినిమాలే కాదు.. రీరిలీజ్ సందర్భాలలో థియేటర్ల వద్ద సందడి చేస్తున్న లేడీ ఫ్యాన్స్ సంఖ్య చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా రీరిలీజ్ అవుతున్న ప్రతీ సినిమాను లేడీస్ సైతం పెద్ద ఎత్తున ఆదరిస్తుండటం అత‌డి మార్కెట్ స్టామినాను తెలియజేస్తోంది.

గత కొంతకాలంగా ప్రభాస్ పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. 2010లో వచ్చిన `డార్లింగ్` సినిమా 2026 ఏప్రిల్‌లో రీరిలీజ్ కాగా 1.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై అద్భుతమైన రికార్డ్ సృష్టించింది. అలాగే `బాహుబలి: ది ఎపిక్`, అక్టోబర్ 23న అత‌డి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన `వర్షం` (2004) చిత్రంతో పాటు `మిస్టర్ పర్ఫెక్ట్`, `మిర్చి`, `ఛత్రపతి`, `ఈశ్వర్`, `రెబెల్`, `సలార్: పార్ట్ 1- సీజ్‌ఫైర్` వంటి చిత్రాలన్నీ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోను గొప్ప ఆద‌ర‌ణ పొందాయి. ఇక‌ అమెరికా వంటి దేశాల్లోనూ మహిళా ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టాయి.

ప్రభాస్ సినిమాల్లో సహజంగానే మహిళా ఫ్యాన్స్ ఆదరణ పుష్కలంగా ఉంటుంది. అదే ఆదరణ రీరిలీజ్‌ల రూపంలో కూడా కొనసాగుతోంది. కొత్త సినిమాలైనా.. పాత క్లాసిక్స్ రీరిలీజ్‌లైనా లేడీ ఫ్యాన్స్ చూపించే ఈ అభిమానమే ప్రభాస్ బాక్సాఫీస్ సునామీకి అసలైన బలం అని అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌భాస్ సినిమా విడుద‌ల‌వుతోంది అంటే మొద‌టి రోజు ఏకంగా 200 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి అంటే.. దాని అర్థం మ‌హిళా ఫ్యాన్స్ కూడా థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నార‌నే ... తరాలు మారుతున్నా, రికార్డులు మారుతున్నా `డార్లింగ్` ప్రభాస్ పై మహిళా లోకానికి ఉన్న ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరని శాశ్వత నిధిగా భావించ‌వ‌చ్చు. ప్ర‌భాస్ న‌టిస్తున్న ఫౌజీ, స‌లార్ 2, క‌ల్కి 2898 ఏడి సీక్వెల్ ల‌కు కూడా మ‌హిళా ఫ్యాన్స్ ప్ర‌ధాన బ‌లం. ఈ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్లు అంత‌కుమించి రాబ‌డ‌తాయ‌ని అంచ‌నా వేస్తుండ‌గా, మ‌హిళా ప్రేక్ష‌కుల నుంచి సింహ‌భాగం క‌లెక్ష‌న్స్ ద‌క్కుతాయ‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

Tags:    

Similar News