ఆ స్టైల్‌లో సిగరెట్ తాగడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ - ఆదిత్య దత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `గన్‌మాస్టర్ G9`.

Update: 2026-09-30 03:00 GMT

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ - ఆదిత్య దత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `గన్‌మాస్టర్ G9`. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ పోషించిన పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆదిత్య దత్ రివీల్ చేసారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ సిగరెట్ తాగే శైలి తన తాతయ్య‌, దిగ్గజ గీత రచయిత ఆనంద్ బక్షి శైలిని పోలి ఉంటుందని.. ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రత్యేక మేనరిజాన్ని సినిమాలో డిజైన్ చేశానని తెలిపారు.

ఆదిత్య దత్ మాట్లాడుతూ.. ` తాతగారైన ఆనంద్ బక్షికి సిగరెట్ తాగే విధానంలో విలక్షణమైన శైలి, ప్రత్యేకమైన అలవాటు ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా, భిన్నంగా ఆవిష్కరించే క్రమంలో ఇమ్రాన్‌కు ఆ శైలిని వివరించానన్నారు. `మా తాతగారు ప్రత్యేకమైన పద్ధతిలో స్మోక్ చేసేవారు. నేను ఇమ్రాన్‌తో మాట్లాడి, అదే స్టైల్‌ను స్క్రీన్‌పై అనుకరించమని చెప్పాను. ఇమ్రాన్ కూడా దానిని ఎంతో అద్భుతంగా పండించాడు` అని ఆదిత్య దత్ వెల్లడించారు.

ఈ ట్రిబ్యూట్ వెనుక సుదీర్ఘమైన ఎమోషనల్ బాండింగ్ ఉందని గుర్తు చేసుకున్నారు. తాను సినీ పరిశ్రమలోకి రావడానికి, దర్శకుడిగా మారడానికి ఆనంద్ బక్షి అందించిన ప్రోత్సాహమే ప్రధాన కారణమన్నారు. `నేను సినిమాలు చేయాలనుకుంటున్నానని తాతగారికి చెప్పినప్పుడు ఆయన దానిని తేలికగా తీసిపారేయలేదు. ముందుగా నన్ను కథ చెప్పమని అడిగి విన్నారు. నా సీరియస్‌నెస్‌ను గుర్తించిన తర్వాతే నన్ను మహేష్ భట్ గారి వద్దకు వెళ్లమని చెప్పారు` అంటూ ఆదిత్య దత్ తన సినీ ప్రయాణపు తొలి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఆదిత్య దత్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో `ఆషిక్ బనాయా ఆప్నే`, `దిల్ దియా హై` వంటి గుర్తుండిపోయే చిత్రాల తర్వాత ఇద్ద‌రు మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. వీరి మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం వల్ల ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్ డీటెయిలింగ్‌ను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా ఆవిష్కరించడం సాధ్యమైందని చిత్రబృందం తెలిపింది.

మేకింగ్ శైలి గురించి వివరిస్తూ. లార్జర్ దన్ లైఫ్ క‌మర్షియల్ సినిమాలను తెరకెక్కించడానికే ప్రాధాన్యత ఇస్తానని ఆదిత్య దత్ స్పష్టం చేశారు. తానేమీ డాక్యుమెంటరీలు ...రియలిస్టిక్ సినిమాలు తీయడం లేదని, కానీ తెరపై ఏది చూపించినా దానికి స్క్రీన్ లాజిక్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటాన‌న్నారు. ప్రేక్షకులు థియేటర్లలో చూస్తున్నప్పుడు ప్రతీ సన్నివేశం నమ్మేలా ఉండటమే ప్రాధాన్యమని తెలిపారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ సరసన జెనీలియా డిసౌజా కథానాయికగా న‌టిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News