చిరు సినిమాపై ఇళయరాజా కేసు వేస్తారా?
ఈ విషయమై ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడికి ప్రశ్నఎదురైంది. ఇళయరాజా నుంచి కేసులు రావా అని అడిగితే.. అలా ఏమీ ఉండదని అనిల్ స్పష్టం చేశాడు.;
తన పాత సినిమాల నుంచి చిన్న మ్యూజిక్ బిట్ వాడుకున్నా సరే.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఊరుకోవట్లేదు. నోటీసులు ఇస్తున్నారు. కేసులు వేస్తున్నారు. ఇలా అనేక సినిమాల మేకర్స్ ఆయన ఆగ్రహానికి గురయ్యారు. కొందరు రాజా పాటలు వాడుకున్నందుకు నష్టపరిహారం కట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కొందరు నిర్మాతలు ముందే డబ్బులు కట్టి అనుమతులు తెచ్చుకున్నారు.
అవతల ఉన్నది ఎంతటి పెద్ద వాళ్లయినా సరే.. అనుమతి లేకుండా సాంగ్స్, బీజీఎం వాడితే రాజా ఊరుకోవట్లేదు. అందుకే ఇళయరాజా పాటలు వాడాల్సిన సందర్భం వచ్చినా.. అవాయిడ్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో ఇళయరాజా పాట వాడడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. సినిమా ఆరంభంలో చిరు, నయన్ కలిసే ఒక సన్నివేశంలో బ్యాగ్రౌండ్లో ఇళయరాజా పాట వినిపించడంతో టీం మేస్ట్రో ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అనుకున్నారు.
ఈ విషయమై ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడికి ప్రశ్నఎదురైంది. ఇళయరాజా నుంచి కేసులు రావా అని అడిగితే.. అలా ఏమీ ఉండదని అనిల్ స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ఇళయరాజా పాట వాడాలని అనుకున్నపుడు నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి ఇళయరాజా దగ్గరికి వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారన్నారు. దాని కోసం డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదని.. ఇలా సందర్భానుసారం చిరంజీవి గారి సినిమాలో మీ పాట వాడుకుంటున్నాం అంటే, ఆయన సంతోషంగా ఓకే చెప్పినట్లు అనిల్ వెల్లడించాడు.
ఇళయరాజా పాట వాడితే కేసు వేసేస్తారు అని బయట ప్రచారం జరుగుతోందని.. కానీ ఇలాంటి వాటికి ఒక ప్రాసెస్ ఉంటుందని.. దాన్ని ఫాలో అయితే.. తన అనుమతి మేరకు పాటను వాడుకుంటే ఆయన ఏమీ అనరని.. వేరే సినిమాల వరకు ఏం జరిగిందో కానీ.. తమ సినిమా విషయంలో జరిగింది ఇదీ అని అనిల్ వెల్లడించాడు. కాబట్టి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఇళయరాజా నుంచి నోటీసులు, కేసులు లాంటివేమీ ఉండవన్నమాట.