'ధురంధర్' స్టాటిస్టిక్స్ పాఠాలు: IIM అహ్మదాబాద్ ప్రొఫెసర్ క్రియేటివిటీకి ఇంటర్నెట్ ఫిదా!
ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ విద్యార్థులకు క్లిష్టమైన స్టాటిస్టిక్స్ (గణాంక శాస్త్రం) సబ్జెక్టును వివరించడానికి బ్లాక్‌బస్టర్ సినిమా `ధురంధర్`లోని సన్నివేశాలను ఉపయోగించారు.
ప్రతిష్ఠాత్మక ఐఐఎంలో స్టడీ అంటే ప్రతిదీ ప్రాక్టికల్‌గా విద్యార్థులకు అర్థమయ్యే విధానంలో భోధిస్తారనే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దేశంలోని బెస్ట్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఐఐఎం- అహ్మదాబాద్ లో ఒక గురువుగారు అనుసరించిన వినూత్న టీచింగ్ మెథడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్లిష్టమైన సబ్జెక్టులను కూడా కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఎంత సరదాగా మార్చవచ్చో ఈ ఘటన నిరూపించింది. ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ విద్యార్థులకు క్లిష్టమైన స్టాటిస్టిక్స్ (గణాంక శాస్త్రం) సబ్జెక్టును వివరించడానికి బ్లాక్‌బస్టర్ సినిమా `ధురంధర్`లోని సన్నివేశాలను ఉపయోగించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఆసక్తికర వీడియోను ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థి ప్రఖర్ సింగ్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసారు. అందులో క్లాస్‌రూమ్‌లోని పెద్ద స్క్రీన్‌పై విద్యార్థులంతా `ధురంధర్` సినిమా సీన్‌ను ఆసక్తిగా వీక్షించడం కనిపిస్తుంది. ఆ వెంటనే ప్రొఫెసర్ రంగంలోకి దిగి.. ఆ సన్నివేశాన్ని ఉదహరిస్తూ స్టాటిస్టిక్స్‌లోని అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ అనుభవాన్ని ప్రఖర్ సింగ్ షేర్ చేస్తూ.. ``ఐఐఎం అహ్మదాబాద్‌లో మాత్రమే ఒక ధురంధర్ సీన్ స్టాటిస్టిక్స్ పాఠంగా మారుతుంది. `విన్ ల్యారీ, విన్ పాకిస్తాన్` అనే డైలాగ్‌ను క్లస్టర్ శాంప్లింగ్‌కు.. ``బలోచ్ ముఠాలు, పఠాన్ ముఠాలు ప్రాథమికంగా భిన్నమైన సమూహాలు`` అనే అంశాన్ని స్ట్రాటిఫికేషన్‌కు లింక్ చేస్తూ ప్రొఫెసర్ బోధించారు. ఒక నిమిషం మీరు గ్యాంగ్ వార్ చూస్తుంటే... మరుసటి నిమిషంలో సర్వే డిజైన్, రీసెర్చ్ మెథడాలజీ గురించి చర్చిస్తుంటారు!`` అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఈ వినూత్న బోధనా శైలికి నెటిజనులు ఫిదా అయిపోయారు. సదరు ప్రొఫెసర్ చాతుర్యాన్ని, సృజనాత్మకతను కామెంట్ల రూపంలో విపరీతంగా కొనియాడారు. ``ఈ ప్రొఫెసర్ ఆలోచనా స్థాయి వేరే లెవెల్. క్లిష్టమైన స్టాటిస్టిక్స్‌ను కూడా చాలా సరళంగా.. మనకు రిలేట్ అయ్యేలా మార్చేశారు. కోర్సును ఇంత వేగంగా అప్‌డేట్ చేయడం ఆయనకే సాధ్యం`` అని ఒక నెటిజన్ ప్రశంసించగా.. అమెరికా వంటి దేశాల్లో ప్రొఫెసర్లు ఇలా సినిమాలను వాడుతూ పాఠాలు చెప్పడం సర్వసాధారణమని... భారతదేశంలో మాత్రం ఇలాంటి అధునాతన శైలి కేవలం కొన్ని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎంల వంటి ఎలైట్ విద్యాసంస్థలకే పరిమితమైందని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఏ సబ్జెక్ట్ పాఠం చెప్పడానికైతే ప్రొఫెసర్ ఈ సినిమాను ఎంచుకున్నారో..ఆ `ధురంధర్` చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దర్శకుడు ఆదిత్య ధర్ రెండు భాగాలుగా తెరకెక్కించగా ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. భారతీయ సినిమా చరిత్రలో అప్పటివరకు ఉన్న అతిపెద్ద ఫ్రాంచైజీలైన పుష్ప, బాహుబలి వంటి క్రేజీ చిత్రాల రికార్డులను కూడా అధిగమించి ఈ సిరీస్ సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఈ భారీ ఫ్రాంచైజీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇంతటి భారీ విజయం సాధించిన చిత్రంలోని ఆసక్తికరమైన గ్యాంగ్ రైవల్రీ సీన్లను బేస్ చేసుకుని, విద్యార్థులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా రీసెర్చ్ మెథడాలజీని వివరించిన ఐఐఎం ప్రొఫెసర్ క్రియేటివిటీ నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఐఎం ప్రొఫెసర్లే సినిమాలను రిఫరెన్సులుగా తీసుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నారు గనుక .. ఇదే భోధనా విధానాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్- తెలంగాణలోని అన్ని హైస్కూల్స్ లోను అడాప్ట్ చేస్తారేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.