ఇంతకీ మన ఐమ్యాక్స్ ఎక్కడ?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణలను చెప్పొచ్చు. మన వాళ్ల సినిమా ప్రేమ గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు.

Update: 2026-05-31 06:08 GMT

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణలను చెప్పొచ్చు. మన వాళ్ల సినిమా ప్రేమ గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. ఐతే ఇంత అభిమానం ఉన్న చోట ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో కొన్నేళ్లు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ రన్ చేశారు కానీ.. తర్వాత అగ్రిమెంట్ రద్దు చేసుకుని వెళ్లిపోయింది ఐమాక్స్. ఇక అప్పట్నుంచి ఐమాక్స్ స్క్రీన్ కోసం తెలుగు ప్రేక్షకుల నిరీక్షణ కొనసాగుతోంది.

ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఐమాక్స్ తెర హైదరాబాద్‌ను పలకరించడం లేదు. ఐతే త్వరలో ఐమాక్స్ స్క్రీన్ వస్తోందంటూ గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సునీల్ నారంగ్.. మళ్లీ ఇప్పుడు ఊరిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అనౌన్స్‌మెంట్ కూడా రాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నారంగ్ ఇలాగే ఊరించి ఉస్సూరుమనిపించిన నేపథ్యంలో కొత్త స్టేట్మెంట్‌ను కూడా అనుమానంగా చూస్తున్నారు జనం.

ఐతే ఈసారి మాత్రం ఐమాక్స్ వార్త నిజం అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది రాజమౌళి, మహేష్ బాబుల మెగా ఫిలిం ‘వారణాసి’ విడుదల సమయానికి హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ రెడీగా ఉండాలనే సంకల్పం నారంగ్‌లో బలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఈసారి ఆయన మాటను నమ్మొచ్చనే అంటున్నారు. ఐతే ఐమాక్స్ రావడం పక్కా అయితే.. అది ఎక్కడ వస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇంతకుముందు హకీం పేటలో ఐమాక్స్ స్క్రీన్ నిర్మాణం జరగనున్నట్లు నారంగ్ తెలిపారు.

కానీ అక్కడ ఇప్పటికిప్పుడు మల్టీప్లెక్స్ కట్టి ఐమాక్స్ స్క్రీన్ నిర్మాణం జరపడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు. హైదరాబాద్‌లో అతి పెద్ద సినిమా హబ్ అనదగ్గ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే ఈ స్క్రీన్ రాబోతున్నట్లు చెబుతున్నారు. గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న చోట ఈ స్క్రీన్‌‌ను చూడబోతున్నామట. ఐతే సుదర్శన్ 70 ఎంఎం ఉన్న చోట ఆల్రెడీ ఏఎంబీ క్లాసిక్ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకుంటోంది. నిజానికి ఈ ఏడాది ఆరంభంలోనే ఇది మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఐమాక్స్ స్క్రీన్ కోసమే దాన్ని ఆలస్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐమాక్స్ స్క్రీన్ నిర్మించాలని అనుకున్నాక దాని డిజైన్ కూడా మార్చినట్లుగా చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరికే ఈ స్క్రీన్ రెడీ అయిపోవచ్చని అంటున్నారు. మరి నారంగ్ చెప్పినట్లు ఇంకో మూణ్నాలుగు రోజుల్లో అనౌన్స్‌మెంట్‌ వచ్చేట్లయితే ఐమాక్స్ స్క్రీన్ గురించి ఏం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News