ఉచిత సినిమాలు డౌన్‌లోడ్‌లు డేంజ‌ర్: సిపి స‌జ్జ‌నార్!

సీపీ స‌జ్జ‌నార్ చొర‌వ‌తో సైబ‌ర్ క్రైమ్ శాఖ ఇటీవ‌ల సినిమాల పైర‌సీకి కార‌కుల‌ను ప‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-24 18:33 GMT

సైబ‌ర్ కేటుగాళ్లు డ‌బ్బు కొట్టేయ‌డానికి, బ్లాక్ మెయిల్ చేయ‌డానికి కార‌ణం ఉచిత ఆఫ‌ర్ల‌కు ఆశ‌ప‌డ‌ట‌మేన‌ని క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ స‌జ్జ‌నార్ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. ఉచిత సినిమాలు, ఉచిత డౌన్ లోడ్‌లు అంటూ పంపించే లింక్ ల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని సూచించారు. దీనివ‌ల్ల మ‌న‌కు తెలియ‌కుండానే హ్యాక‌ర్లు మ‌న సిస్ట‌మ్ లోకి జొర‌బ‌డి డేటాను దొంగిలించి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు.

ఫేక్ వెబ్ సైట్లు, ఫేక్ యాప్ లు ఎక్కువ‌గా ఉన్నాయి. వాటిని అస్స‌లు ఉప‌యోగించ‌వద్దు. ఎవ‌రూ గుర్తించ‌లేని బ‌ల‌మైన పాస్ వ‌ర్డ్స్ పెట్టుకోండి అని కూడా తెలిపారు. సీపీ స‌జ్జ‌నార్ ఎంతో యాక్టివ్ గా హైద‌రాబాద్ లో నేరాల‌ను త‌గ్గించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల న‌గ‌రంలోని ప‌లు సెన్సిటివ్ ప్రాంతాల‌లో అక‌స్మాత్తుగా ప‌ర్య‌టించి రౌడీ షీట‌ర్ల రెగ్యుల‌ర్ యాక్టివిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. నేరుగా రౌడీ షీట‌ర్ల‌ను క‌లిసేందుకు ఆయ‌న ఎలాంటి పోలీస్ కాన్వాయ్ ల‌ను ఉప‌యోగించ‌లేదు. చాలా సింపుల్ గా ప్ర‌యాణించి రౌడీ షీట‌ర్ల‌ను క‌లిసారు.

సీపీ స‌జ్జ‌నార్ చొర‌వ‌తో సైబ‌ర్ క్రైమ్ శాఖ ఇటీవ‌ల సినిమాల పైర‌సీకి కార‌కుల‌ను ప‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఐబొమ్మ ర‌విని పోలీసులు తెలివిగా వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకోవ‌డంలో సీపీ చొర‌వ‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. ఐబొమ్మ ర‌వి అరెస్ట్ అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో సినీపెద్ద‌ల‌తోను సీపీ ముచ్చ‌టించారు.

న‌కిలీ ఖాతాల‌తో జాగ్ర‌త్త‌:

తన పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించి, తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న సైబర్ నేరస్థుల గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను ఇటీవ‌ల ఓ స‌మావేశంలో అప్రమత్తం చేశారు. ఈ ఖాతాలు ముఖ్యంగా స్నేహితులను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత సందేశాలను పంపుతున్నాయ‌ని కూడా వెల్ల‌డించారు. ``నేను ప్రమాదంలో ఉన్నాను... వెంటనే డబ్బు పంపండి`` అంటూ ప్ర‌జ‌ల‌కు భ‌య‌పెట్టే మెసేజ్ లు పంపుతున్నారు. త‌న పేరుతో చాలా న‌కిలీ ఫేస్ బుక్ ఖాతాలు న‌డుస్తున్నాయ‌ని పేర్క‌న్న సీపీ ఒరిజిన‌ల్ ఎఫ్‌.బి. అకౌంట్ ని అంద‌రికీ ప్ర‌ద‌ర్శించారు.

ఈ నంబ‌ర్‌కి సంప్ర‌దించండి:

హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం ఈ మోసపూరిత సోష‌ల్ మీడియా ఖాతాలను గుర్తించి తొలగించడానికి మెటాతో కలిసి పనిచేస్తోంది. సెలబ్రిటీలమని చెప్పుకునే వ్యక్తులు, ముఖ్యంగా డబ్బు అభ్యర్థించే వారి నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించవద్దని లేదా సందేశాలకు ప్రతిస్పందించవద్దని సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

సైబర్ మోసానికి పాల్పడిన నకిలీ ఖాతాలను ఎదుర్కొనే ఎవరైనా 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సిఫార్సు చేశారు.

Tags:    

Similar News