తారక్ మీకు అన్న నాకు తమ్ముడు: హృతిక్ రోషన్
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.;
ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఎన్టీఆర్, హృతిక్, అయాన్ ముఖర్జీ సహా సితార అధినేత వంశీ, ఇతర చిత్రబృందం సందడి చేసారు. వేలాదిగా తరలి వచ్చిన ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. వేదికపై గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తెలుగులో మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
హృతిక్ మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం..హైదరాబాద్ .. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ సౌకర్యంగా ఉన్నారని అనుకుంటున్నాను.. ఈరోజు వేడుకకు వచ్చినందుకు.. జనవాహిని నాకు వామ్ వెల్ కం చెప్పినందుకు థాంక్స్..'' అని అన్నారు. ఇక వేదికపై మాట్లాడుతున్నంత సేపూ `రియల్ టైగర్` అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికెత్తేసాడు హృతిక్. నేను టైగర్ ఫ్యాన్స్ గర్జన వినాలనుకుంటున్నాను అంటూ తారక్ అభిమానులను హృతిక్ కోరారు. ``తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మేమంతా అన్నదమ్ములం.. ఒకే ఫ్యామిలీ`` అని హృతిక్ సోదరభావాన్ని ప్రదర్శించాడు. మీ అందరినీ చూడటం సంతోషంగా ఉంది. క్రిష్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ తెలుగు ప్రజల అతిథి మర్యాదలు ఎంతో గొప్పగా ఉంటాయని వేదికపై గుర్తు చేసుకున్నారు. వార్ 2 కోసం తారక్ నేను కోస్టార్స్ గా పని చేసాం. చివరికి మేం నిజ జీవితంలో అన్నదమ్ములుగా మారాము.. అని కూడా అన్నారు.
వార్ 2 .. యుద్ధానికి మీరంతా రెడీనా? అంటూ అశేష ప్రేక్షక జనంలో ఉత్సాహం నింపారు. నేను మీకు ప్రామిస్ చేస్తాను.. ఒక మంచి సినిమాని అందిస్తున్నాం.. అని హృతిక్ అన్నారు. వార్ 2 తన కెరీర్ లోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని, టాప్ లో రైడ్ చేస్తుందని హృతిక్ అన్నారు. వార్ 1 లో కబీర్ పాత్రను ఎంతగానో ప్రేమించారు. కహోనా ప్యార్ హై సమయంలో ఎంతగా ప్రేమించారో వార్ రిలీజ్ సమయంలో అదే ప్రేమను గుర్తు చేసుకున్నాను. ధూమ్ 2, క్రిష్ లో నా పాత్రలను అంతే ప్రేమించారు. మళ్లీ వార్ 2 లో కబీర్ పాత్రకు అంతటి ప్రేమ దక్కుతుందని ఆశిస్తున్నాను.. ఈసారి నేను రియల్ టైగర్ (ఎన్టీఆర్) తో కలిసి పని చేసానని హృతిక్ అన్నారు. హృతిక్ స్పీచ్ ఆద్యంతం తారక్ పై ప్రేమ, ఆప్యాయత, సోదరభావం కనిపించింది.