చేతిక‌ర్ర సాయంతో గ్రీక్ గాడ్ న‌డ‌క‌.. ఆందోళ‌న‌లో అభిమానులు!

బాలీవుడ్ `గ్రీక్ గాడ్` హృతిక్ రోషన్ చేతి కర్రల సాయంతో నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;

Update: 2026-01-26 04:00 GMT

బాలీవుడ్ `గ్రీక్ గాడ్` హృతిక్ రోషన్ చేతి కర్రల సాయంతో నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త‌మ అభిమాన క‌థానాయ‌కుడికి ఏమైందో అర్థం కాని గంద‌రగోళంలో అభిమానులు తీవ్రంగా క‌ల‌తకు గుర‌వుతున్నారు. అస‌లింత‌కీ గ్రీక్ గాడ్ కి ఏమైంది? ఆరా తీస్తే... తెలిసిన సంగ‌తులివి.

ముంబైలో శనివారం రాత్రి ప్రముఖ దర్శకుడు గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి హృతిక్ రోషన్ హాజరయ్యారు. పార్టీ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో హృతిక్ మోచేతి కర్రల సాయంతో చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ కనిపించారు. ఆ స‌మ‌యంలో అత‌డు బ్లాక్ హుడీ ధ‌రించి క‌నిపించాడు. సాధారణంగా ఎంతో ఫిట్‌గా ఉండి, స్టైలిష్‌గా నడిచే హృతిక్‌ను అలా చూడటంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు.. ఎప్పుడూ కెమెరాల‌కు చిరునవ్వుతో పోజులిచ్చే హృతిక్, ఈసారి మాత్రం ఫోటోలకు నిరాకరించి నేరుగా తన కారు వైపు వెళ్ళిపోవ‌డం స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌లోను ఆందోళ‌న క‌లిగించింది.

తాజా సమాచారం ప్రకారం.. హృతిక్ మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గాయం ఎలా అయింది అనే దానిపై అధికారిక వివరణ రాలేదు. కొందరు ఇది తదుపరి సినిమా `క్రిష్ 4` కోసం చేస్తున్న ప్రాక్టీస్ సమయంలో జరిగిందని భావిస్తుంటే, మరికొందరు పాత గాయం మళ్ళీ తిరగబెట్టి ఉండవచ్చని అనుకుంటున్నారు.

గత ఏడాది కూడా హృతిక్ మోకాలి గాయంతో ఇలాగే కర్రల సాయంతో కనిపించారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు త‌మ అభిమాన దేవుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అంతగా కష్టపడి వర్కౌట్స్ చేయడం వల్లే ఇలాంటి గాయాలు అవుతున్నాయా? ఎందుకు ఇంత రిస్కు చేస్తున్నారు? అని కొందరు అభిమానులు ఆవేద‌న‌ వ్యక్తం చేస్తున్నారు.

హృతిక్ క‌మిట్ మెంట్ అలాంటిది:

నిజానికి డ్యాన్సుల విష‌యంలో హృతిక్ క‌మిట్ మెంట్ డెడికేష‌న్ కొన్నిసార్లు అత‌డిని ప్ర‌మాదంలోకి నెట్టేస్తుంది. నొప్పి ఉన్నా అత‌డు ఖాత‌రు చేయ‌కుండా ప్రాక్టీస్ చేస్తాడు. కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ జిందగీ నా మిలేగీ దోబారా చిత్రంలోని సెనోరిటా పాటను చిత్రీకరించేటప్పుడు హృతిక్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. సెనోరిటా పాట‌ కఠినమైన స్టెప్పుల‌తో ఉంటుంది... ఆ పాట షూటింగ్ సమయంలో హృతిక్ తీవ్రమైన మోకాలి నొప్పిని ఎదుర్కొన్నాడు. నొప్పి ఉన్నా కానీ హృతిక్ అద్భుతమైన డ్యాన్స్ ను ప్రదర్శించాడు.

బ్యాంగ్ బ్యాంగ్‌లోని పాట `తు మేరీ` చిత్రీకరణ సమయంలో హృతిక్ ప‌ర్ఫెక్ష‌న్ గురించి బాస్కో గుర్తుచేసుకున్నాడు. అత‌డు అదే స్టెప్‌ను సరిగ్గా రాబ‌ట్ట‌డానికి వందల సార్లు రిహార్సల్ చేసేవాడు. షూటింగ్ సమయంలో మేం ఒక్కోసారి 5 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. హృతిక్ కదలికలు నేలపై ఉండాలి.. గురుత్వాకర్షణ శక్తి ఉండాలి.. నేల‌పై బూట్లు చాలా సున్నితంగా ఉండాలి అనేది మా ఆలోచన. హృతిక్ ప్రత్యేకంగా తన బూట్లు నేలపై సౌకర్యవంతంగా ఉండే వరకు, పాటను ఆస్వాధించ‌లేడు! అంత‌గా ప‌ర్ఫెక్ష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తాడు! అని కొరియోగ్రాఫర్ బాస్కో తెలిపారు.

Tags:    

Similar News