క్లైమాక్స్ లో మరోసారి మాటల మాంత్రికుడి మాయాజాలం!
తాజాగా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో ఆ ముగింపు ఘట్టం ఎలా ఉండబోతుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.;
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్ 47` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రైటర్ గా వెంకీకి గురూజీ ఇచ్చిన సక్సెస్ ల నేపథ్యంలో ఆదర్శ కుటుంబంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందని అంతా భావిస్తున్నారు. టైటిల్ వినడానికి చాలా సాఫ్ట్‌గా, ఫ్యామిలీ ఓరియంటెడ్‌గా ఉన్నా? సినిమా క్లైమాక్స్ మాత్రం హై-వోల్టేజ్ యాక్షన్ -ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని లీకులందుతున్నాయి. తాజాగా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో ఆ ముగింపు ఘట్టం ఎలా ఉండబోతుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
హౌస్ నంబర్ 47 అనేది కేవలం అడ్రస్ మాత్రమే కాదు. అదొక రహస్యానికి నిలయం. క్లైమాక్స్‌లో ఇంటి చుట్టూనే కథా గమనం మొత్తం తిరుగుతుందిట. ఆదర్శ కుటుంబం అని బయటకు కనిపిస్తున్నా? ఆ ఇంటి గడప దాటి లోపలికి వెళ్తే ఎదురయ్యే సవాళ్లు? ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి కథానాయకుడు చేసే పోరాటం క్లైమాక్స్‌లో హైలైట్‌గా నిలవనుందిట. త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయమం టున్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా ఇంటి ఆవరణలోనే సాగుతుందిట. బయటి నుండి వచ్చే శత్రువుల దాడి నుంచి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ హీరో ఎలా తిప్పికొట్టాడు అనే కోణంలో ఈ పోరాటం ఉంటుందిట.
ఇందులో వెంకటేష్ యాక్షన్ హీరోగానే కాక బాధ్యతగల కుటుంబ పెద్దగా కనిపిస్తారు. ఆయన చేసే ప్రతి దాడి వెనుక ఓ బలమైన కారణం, ఎమోషన్ ఉండేలా త్రివిక్రమ్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు సినిమాకే ప్రాణం పోస్తాయంటున్నారు. `కుటుంబం అంటే కేవలం కలిసి ఉండటం కాదు.. ఒకరి కోసం ఒకరు నిలబడటం` అనే సందేశాన్ని త్రివిక్రమ్ తనదైన శైలిలో పదునైన మాటలతో ముగించబోతున్నారు. హీరో శత్రువులను భౌతికంగా ఓడించడమే కాదు మాటలతో వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చేలా ? తప్పును ఎత్తి చూపేలా ఈ ముగింపు ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే? క్లైమాక్స్‌లో కీలకమైన ట్విస్ట్ ఉండే అవకాశం ఉందిట. `ఆదర్శ కుటుంబం అని పిలవబడే ఆ ఇంట్లోని సభ్యులలోనే ఒకరి రహస్యం లేదా గతం ముగింపులో బయటపడే అవకాశం ఉందిట. ఈ ట్విస్ట్ షాక్ ఇవ్వడానికే కాదు. కథకు సంపూర్ణమైన ముగింపుని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ ఎమోషనల్ ట్విస్ట్ తో ప్రేక్షకులు థియేటర్ల నుండి బయటకు వచ్చేటప్పుడు బరువెక్కిన హృదయంతో వచ్చేలా చేస్తుందంటున్నారు. మొత్తానికి మరోసారి గురూజీ కంటెంట్ ని బలమైన ఎమోషన్ తోనే కనెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రీకరణకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.