పెద్ది టీమ్ కు కొత్త తలనొప్పి.. హైకోర్టు ఏం చేయనుందో?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ మూవీ పెద్ది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ మూవీ పెద్ది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఆ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన వేళ.. ఇప్పుడు టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఆ విషయం తెలంగాణ సర్కార్ కే కాకుండా మూవీ యూనిట్ కు కూడా తలనొప్పిగా మారింది.
పెద్ది సినిమా విడుదల సందర్భంగా థియేటర్లలో టికెట్ ధరలు కొన్ని రోజుల వరకు పెంచుకునేందుకు తెలంగాణ హోంశాఖ ఈ నెల 2వ తేదీన స్పెషల్ మెమో జారీ చేసింది. ఆ మెమో ప్రకారం జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ పై రూ.100, మల్టీప్లెక్సులలో రూ.125 వరకు ఎక్స్ ట్రాగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే ఆ నిర్ణయం గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఆరోపిస్తూ డి. చంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు గుర్తు చేసిన హైకోర్టు, "ఇకపై ధరలు పెంచబోమని చెబుతూ.. ప్రతి పెద్ద సినిమా విడుదల సమయంలో స్పెషల్ మెమోలు జారీ చేయడం ఏంటి?" అని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి ఇలాంటి అనుమతులు ఇవ్వడం చట్టబద్ధం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం.
టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వం తప్పనిసరిగా జీవో నెంబర్-121లో ఉన్న నిబంధనలు ఫాలో అవ్వాలని ధర్మాసనం పేర్కొంది. గతంలో థియేటర్ల క్లాసిఫికేషన్ ఆధారంగా టికెట్ ధరలు నిర్ణయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అలాంటి పరిస్థితుల్లో మెమోలు జారీ చేస్తూ అదనపు ధరలకు అనుమతులు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటని క్వశ్చన్ చేసింది.
అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ వివాదం పెద్ది సినిమాపై ప్రభావం చూపే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. కానీ కోర్టు ధిక్కరణ పిటిషన్ లో హోంశాఖ అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఫ్యూచర్ లో టికెట్ ధరల పెంపుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, పెద్ద హీరోల సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు విచారణలో తీసుకునే నిర్ణయం కేవలం పెద్ది సినిమాకే కాదు.. ఫ్యూచర్ లో విడుదలయ్యే భారీ సినిమాల టికెట్ ధరల విధానంపై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 15న జరగబోయే విచారణపై ఉంది. మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.