డ్రీమ్‌ గర్ల్‌ చేసిన పనికి అంతా షాక్‌..!

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు సుపరిచితురాలు అయిన డ్రీమ్‌ గర్ల్‌ హేమా మాలిని గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా వార్తలు రాలేదు.;

Update: 2025-09-02 08:30 GMT

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు సుపరిచితురాలు అయిన డ్రీమ్‌ గర్ల్‌ హేమా మాలిని గురించి ఈ మధ్య కాలంలో పెద్దగా వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు హేమా మాలిని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమె అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హేమా మాలిని దాదాపు నాలుగు అయిదు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా నిలిచారు. ఇప్పటికీ ఆమె ఏదైనా చిన్న కార్యక్రమంలో కనిపించినా, చిన్న పాత్ర పోషించినా కూడా ఎక్కువ పారితోషికం తీసుకుంటారు అనే టాక్ ఉంది. ఆమె డిమాండ్‌కు తగ్గట్లుగా పారితోషికం అందుకుంటూ ఉంటారు. డ్రీమ్‌ గర్ల్‌ హేమా మాలిని ఆస్తులు భారీగా ఉంటాయని కూడా బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.

బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్‌గా..

హేమా మాలిని భర్త ధర్మేంద్ర సైతం బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అనే విషయం తెల్సిందే. ఆయన సైతం సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడం వల్ల ఆస్తులు బాగానే కూడబెట్టారు. ఇద్దరూ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ ఆస్తులను హేమామాలిని అమ్మడం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా సెలబ్రిటీలు ఆస్తులు కొన్నారు అనే వార్తలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఖరీదైన ఏరియాలో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన సెలబ్రిటీ అంటూ చాలా సార్లు వార్తలు చూశాం. అయితే నిర్మాతలు అప్పుడప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ చాలా వరకు నటీనటులు కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌, ఇతర ఆస్తులను అమ్మేందుకు ఆసక్తి చూపించరు. కానీ హేమామాలిని ఆస్తులను అమ్మడం చర్చనీయాంశం అయింది.

ముంబైలోని ఖరీదైన ఏరియాలో అపార్ట్‌మెంట్‌..

గత నెలలో హేమా మాలిని ముంబైలోని ఓషివారా ప్రాంతంలో తన పేరు మీద ఉండే రెండు అపార్ట్‌మెంట్‌లను ₹ 12.50 కోట్లకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వెళ్లడి అయింది. ఇందుకు గాను కొనుగోలు చేసిన వారు దాదాపుగా రూ.62.5 లక్షల స్టాంప్‌ డ్యూటీని చెల్లించారు. అంతే కాకుండా 60 వేల రూపాయల రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబైలోని అత్యంత రద్దీ ఏరియాలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అమ్మడం ద్వారా హేమా మాలిని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు వాటిని అమ్మాల్సిన అవసరం ఏం వచ్చింది అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు హేమా మాలిని లేదా ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ ఆ అపార్ట్‌మెంట్స్ అమ్మడం గురించి స్పందించలేదు.

హేమా మాలిని కొత్త కారు

ఇదే సమయంలో హేమా మాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసిందనే వార్తలు వస్తున్నాయి. దాదాపుగా రూ.75 లక్షల రూపాయలు ఖర్చు చేసి హేమా మాలిని కారు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉన్నట్లుండి హేమా మాలిని అపార్ట్‌మెంట్‌ ను అమ్మడం, కొత్త కారును కొనుగోలు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు ఏదో ఒక రూపంలో ఆదాయం వస్తూనే ఉంది. అయినా కూడా ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం ఏం వచ్చిందో అని కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం మరెక్కడైనా మంచి ప్రాపర్టీ కొనుగోలు చేస్తుందేమో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల మీడియాలోనూ ఈ విషయం గురించి ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.

Tags:    

Similar News