క్రేజీ లవ్ స్టోరీతో 'దీవాన'.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఇప్పటికే విడుదలైన టీజర్ తో యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమా, తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ ను సొంతం చేసుకుంది.
శుభం మూవీతో హీరోగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రెడ్డి, ఇప్పుడు మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దీవాన. స్నేహ మణిమేగలై హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఆ సినిమా, తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ ను సొంతం చేసుకుంది.
జూన్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఆ సినిమా ట్రైలర్ ను మూవీ టీమ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ట్రైలర్ చూస్తే ఇది కేవలం నార్మల్ లవ్ స్టోరీ కాదని, ఒక వన్ సైడ్ లవ్ చుట్టూ తిరిగే ఎమోషనల్ జర్నీ అని అర్థమవుతోంది. "ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ లవ్ తోనే స్టార్ట్ అవుతది రా భాయ్" అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ మొదటి నుంచే ఆసక్తిని పెంచుతుంది.
హైదరాబాద్, తెలంగాణ యాసలో సాగే కన్వర్జేషన్స్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో తన లవర్ 'అమ్ము' ప్రేమను పొందేందుకు చేసే ప్రయత్నాలు, ఆమె కోసం పడే తపన, మధ్యలో ఎదురయ్యే పరిస్థితులు ట్రైలర్ లో మెయిన్ గా కనిపించాయి. ప్రేమలోని బాధ, ఆవేదన, ఆశ, పట్టుదల వంటి ఎలిమెంట్స్ ను డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, లవ్ స్టోరీతో పాటు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ స్పష్టం చేసింది. హీరోయిన్ ను ఇబ్బంది పెట్టే వ్యక్తిపై హీరో తిరగబడే సన్నివేశాలు, స్నేహితులతో కలిసి వచ్చే సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఇది కేవలం రొమాంటిక్ డ్రామాగా కాకుండా కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
"లవ్ తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా.. అందులో సత్యంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భాయ్", "ఐ యామ్ నాట్ బేవర్స్.. ఐ యామ్ మ్యాన్ అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యు" వంటి డైలాగ్స్ సినిమాలోని ఎమోషనల్ ఇంటెన్సిటీని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రెజెంట్ జెనరేషన్ యూత్ ప్రేమను ఎలా చూస్తుందో, వన్ సైడ్ లవ్ లో ఉండే బాధ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
గతంలో తొలిప్రేమ, ఆర్య, ఆర్య 2, 7/జీ బృందావన్ కాలనీ వంటి సినిమాలు వన్ సైడ్ ప్రేమ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పుడు ప్రెజెంట్ జెనరేషన్ యూత్ కు దగ్గరగా ఉండే కథతో దీవాన తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. "వన్ సైడ్ లవ్ అంటే చస్తుంటాం.. మస్తుంటాది" అంటూ యువతకు కనెక్ట్ అయ్యేలా ఆ సినిమాను రూపొందించినట్లు చెబుతోంది.
గీతా ఆర్ట్స్ సమర్పణలో వీ స్టూడియోస్, అర్హా మీడియా భాగస్వామ్యంతో రూపొందిన ఆ చిత్రాన్ని వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. కొత్త క్యాస్టింగ్, లోకల్ ఎలిమెంట్స్ కు దగ్గరగా ఉండే కథ, యూత్ కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో వస్తున్న దీవాన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మరి ట్రైలర్ తో పెంచిన అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో జూన్ 19న తెలియనుంది.