బాలీవుడ్‌లో పట్టు బిగిస్తున్న రాజమండ్రి కుర్రాడు!
ఆంధ్రా సంస్కృతికి కేంద్రబిందువైన రాజమండ్రి నుంచి బయలుదేరి నేడు బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు హర్షవర్ధన్ రాణే.
ఆంధ్రా సంస్కృతికి కేంద్రబిందువైన రాజమండ్రి నుంచి బయలుదేరి నేడు బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు హర్షవర్ధన్ రాణే. అతడు తెలుగు మదర్.. మరాఠా తండ్రికి జన్మించాడు. అతడి తండ్రి రాజమండ్రిలోనే ఉద్యోగం చేయడంతో.. హర్షవర్ధన్ చిన్నతనం నుంచే ఆ ఊరితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకున్నారు. ఎన్నో కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతడు మొదట టాలీవుడ్‌లో `తకిట తకిట` అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్. నటులకు కూడా పేరు రాలేదు. ఆ తర్వాత రాణే తన నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకునేందుకు బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.
బాలీవుడ్‌కి వెళ్లిన ప్రారంభంలో హర్షవర్ధన్ రాణేకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా అతడు నటించిన `సనమ్ తేరి కసమ్` సినిమా మొదటిసారి విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అంతేకాకుండా బాలీవుడ్ మీడియాలో అతడి ఎఫైర్ల వార్తలు కూడా మార్మోగాయి. కానీ కాలం మారినట్లుగానే ఆ ఫెయిల్యూర్ సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ అయి ఊహించని రీతిలో బంపర్ హిట్టు కొట్టింది. ఆ విజయం హర్షవర్ధన్ కెరీర్‌నే పూర్తిగా మార్చివేసింది. అక్కడి నుంచి వరుసగా భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని సైతం సొంతం చేసుకున్నారు.
ఇటీవలే `ఏక్ దివానే కి దివానియత్` చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ ఇప్పుడు సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత పరాగ్ సంఘ్వితో కలిసి రెండు సినిమాల్లో భాగస్వామిగా పనిచేస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. `పార్ట్నర్` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన పరాగ్ సంఘ్వితో హర్షవర్ధన్ చేస్తున్న ఈ రెండు చిత్రాలు హిందీ చిత్రసీమలో సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ `పోలీస్ కంపెనీ` లోనూ హర్షవర్ధన్ రాణే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబై పోలీస్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో అతడు నటించనున్నారు. 1990ల ముగింపు .. 2000ల ప్రారంభంలో ముంబైలోని ఆర్గనైజ్డ్ క్రైమ్‌పై పోలీసులు చేసిన పోరాటం నేపథ్యంలో టీ-సిరీస్ నిర్మాతలు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా వెనువెంటనే చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇలా ఒకవైపు పరాగ్ సంఘ్వి ప్రొడక్షన్ లో రెండు సినిమాలు.. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో `పోలీస్ కంపెనీ`, మరికొన్ని భారీ మల్టీస్టారర్లతో హర్షవర్ధన్ రాణే బాలీవుడ్‌ని ఉడుంపట్టు పట్టేస్తున్నారు. రాజమండ్రి నుంచి ప్రారంభమైన ఒక సాధారణ కుర్రాడి సినీ ప్రయాణం.. నేడు ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి చేరడం నిజంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.