38 ఏళ్ల తర్వాత మళ్లీ రేస్ ట్రాక్‌పైకి టామ్ క్రూజ్!
హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ఐకానిక్ కెరీర్‌లో మరో క్లాసిక్ సినిమాకు సీక్వెల్ ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు.
హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ ఐకానిక్ కెరీర్‌లో మరో క్లాసిక్ సినిమాకు సీక్వెల్ ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు. 1990లో రిలీజ్ అయిన నాస్ కార్ రేసింగ్ డ్రామా `డేస్ ఆఫ్ థండర్`కు సీక్వెల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. ఫ్లోరిడాలోని డేటోనా ఇంటర్నేషనల్ స్పీడ్‌వే వేదికగా టామ్ క్రూజ్ ఈ అప్‌డేట్ అందించారు. ఈ భారీ ప్రాజెక్ట్ 2028 జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌లో టామ్ క్రూజ్ సరసన ఆస్కార్ విజేత నటి ఆన్ హాత్‌వే నటిస్తుండటం తో ప్రాజెక్ట్‌పై అంచనాలను అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
ఈ చిత్రంలో ఆన్ హాత్ వే గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా ఒక రేసింగ్ టీమ్ యజమాని ..ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారు. ఒరిజినల్ సినిమాలో డాక్టర్ పాత్రలో నికోల్ కిడ్‌మన్ నటించగా ఇప్పుడు సరికొత్త కోణంలో ఆన్ హాత్‌వే రేసింగ్ ప్రపంచంలో భాగం కాబోతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తెరకెక్కుతున్న చిత్రంలో టామ్ క్రూజ్ మళ్లీ తన పాత పాత్ర కోల్ ట్రికిల్ గా నాస్ కార్ డ్రైవర్‌గా కనిపించనున్నారు. `టాప్ గన్: మావెరిక్` చిత్రంతో పాత క్లాసిక్‌కు అద్భుతమైన సీక్వెల్ అందించిన టామ్ క్రూజ్ ఇప్పుడు అదే తరహాలో `డేస్ ఆఫ్ థండర్` కు కూడా ఊహించని రేంజ్‌లో సీక్వెల్ డిజైన్ చేస్తున్నట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
జొనాథన్ లెవిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ జెర్రీ బ్రక్‌హైమర్, టామీ హార్పర్‌లతో కలిసి టామ్ క్రూజ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విల్ స్టేపుల్స్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. పారామౌంట్ పిక్చర్స్ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ఐమాక్స్, డాల్బీ సినిమా 4DX వంటి ప్రీమియం థియేట్రికల్ ఫార్మాట్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు .
1990లో టోనీ స్కాట్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `డేస్ ఆఫ్ థండర్` ప్రపంచవ్యాప్తంగా 157 మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించి నాస్ కార్ రేసింగ్‌కు పాప్ కల్చర్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. రాబర్ట్ దువాల్ చెప్పిన `రబ్బిన్, సన్ ఈజ్ రేసింగ్` అనే సంభాషణ ఇప్పటికీ రేసింగ్ అభిమానులలో ఎంతో పాపులర్. మళ్లీ ఇప్పుడు అదే రేసింగ్ థ్రిల్‌ను వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ప్రస్తుతం టామ్ క్రూజ్ ఆలెజాండ్రో గొంజాలెజ్ ఇన్యారిటు దర్శకత్వంలో రూపొందుతున్న `డిగ్గర్`, `టాప్ గన్ 3` వంటి భారీ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు.