25 ఏళ్ల తర్వాత రీయూనియన్‌లో మిస్ అయిన జోడీ!
బాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ `దిల్ చాహ్తా హై విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముంబైలో గ్రాండ్‌గా రీయూనియన్ ఈవెంట్ నిర్వహించారు.
బాలీవుడ్ క్లాసిక్ ఫిల్మ్ `దిల్ చాహ్తా హై విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముంబైలో గ్రాండ్‌గా రీయూనియన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, సొనాలి కులకర్ణిలతో పాటు దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, నిర్మాత రితేష్ సిధ్వానీ హాజరై సందడి చేశారు. అయితే ఈ ప్రత్యేక వేడుకలో చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన కథానాయకుడు అక్షయ్ ఖన్నా - హీరోయిన్ ప్రీతి జింటా కనిపించకపోవడం నెటిజన్లను, అభిమానులను నిరాశకు గురి చేసింది.
ముఖ్యంగా అక్షయ్ ఖన్నా రాకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. `రెహ్మాన్ డకాయ్ ఎక్కడ? అని దిల్ చాహ్తా హై రీయూనియన్ ఆయన లేకుండా అసంపూర్తిగా ఉంది అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ ఈ వేడుకకు హాజరవుతారని ఈవెంట్ హోస్ట్ నిఖిల్ తనెజా ఇదివరకు ధృవీకరించినప్పటికీ చివరి నిమిషంలో అక్షయ్ గైర్హాజరు కావడంతో మిస్టరీపై చర్చలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలో అక్షయ్ ఖన్నా గైర్హాజరుపై నిఖిల్ తనెజా స్పష్టత ఇచ్చారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. `దురదృష్టవశాత్తు అక్షయ్ ఖన్నా అస్వస్థతకు గురయ్యారు` అని వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగానే అక్షయ్ ఖన్నా చివరి నిమిషంలో వేడుకకు హాజరుకాలేకపోయారని తెలియడంతో అభిమానుల్లో నెలకొన్న సస్పన్స్ వీడింది. అలాగే ప్రీతి జింటా ప్యారిస్‌లో ఉండటం వల్ల రీయూనియన్ షెడ్యూల్స్ కుదరక రాలేక పోయారని వివరణ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ `ధురంధర్ ` లో రెహ్మాన్ డకాయ్ పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ విజయం తర్వాత అక్షయ్ ఖన్నా ఎక్కువగా బయటి వేడుకలకు, మీడియా ముందుకు రాకుండా దూరంగా ఉంటున్నారు. అందుకే ఈ రీయూనియన్ ఈవెంట్‌కు కూడా అక్షయ్ కావాలనే రాలేదేమో? అని కొంత మంది అభిమానులు అనుమానిస్తున్నారు. కానీ ఆరోగ్య కారణాలే అసలు కారణమని తేలింది.
హిందీ చిత్రసీమలో ఫ్రెండ్‌షిప్ డ్రామాలకు సరికొత్త మైలురాయిగా నిలిచిన `దిల్ చాహ్తా హై` మూవీతో ఫర్హాన్ అఖ్తర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆకాష్ (అమీర్ ఖాన్), సమీర్ (సైఫ్ అలీ ఖాన్), సిద్ధార్థ్/సిద్ (అక్షయ్ ఖన్నా) అనే ముగ్గురు స్నేహితుల బంధం, ప్రేమ , జీవిత ప్రయాణం చుట్టూ తిరిగే కథ పాతికేళ్లు పూర్తయినా ఇప్పటికీ నేటి తరానికి సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.