బాక్స్ ఆఫీస్ ప్రెజర్‌లో యంగ్ అండ్ స్టార్ హీరోలు!

చాలా కాలంగా మాస్ హిట్ కోసం ఎదురు చూసిన‌ అక్కినేని హీరో అఖిల్ ఇటీవల రిలీజ్ అయిన `లెనిన్` చిత్రంతో సరికొత్త ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయ్యారు.

Update: 2026-08-30 09:30 GMT

ఇండస్ట్రీలో విజయం సాధించడం ఎంత కష్టమో? ఆ విజయ పరంపరను నిలబెట్టుకోవడం అంతకంటే సవాలుతో కూడుకున్న వ్యవహారం. బాక్సాఫీస్ వద్ద విజయం ద‌క్క‌గానే హీరోల బాధ్యత వారిపై ఉండే అంచనాలు రెట్టింపు అవుతాయి. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేక తడబడిన కొందరు టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తిరిగి ఫామ్‌లోకి వచ్చి ఊరటనిచ్చే విజయాలను అందుకున్నారు. అయితే వ‌చ్చిన‌ సక్సెస్ ట్రాక్‌ను రాబోయే చిత్రాలతో కంటిన్యూ చేయాల్సిన తీవ్రమైన ఒత్తిడి వారిపై ఉంద‌న్న‌ది అంతే వాస్త‌వం.

చాలా కాలంగా మాస్ హిట్ కోసం ఎదురు చూసిన‌ అక్కినేని హీరో అఖిల్ ఇటీవల రిలీజ్ అయిన `లెనిన్` చిత్రంతో సరికొత్త ఎనర్జీతో బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయ్యారు. విభిన్నమైన మేకోవర్ .. నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అఖిల్ ఇప్పుడు తదుపరి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. `లెనిన్` ఇచ్చిన మాస్ బూస్ట్‌ను కోల్పోకుండా మార్కెట్ స్థాయిని మరింత పెంచేలా స్క్రిప్ట్‌ల ఎంపికపై పూర్తి దృష్టి సారించారు.

మరోవైపు మహారాజా రవితేజ ఇటీవల రిలీజ్ అయిన `ఇరుముడి` చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. వరుస ప్లాప్‌ల తర్వాత లభించిన విజయం రాజా అభిమానులకు తీపి కబురును అందించింది. అయితే మాస్ ఆడియన్స్‌లో క్రేజ్‌ను నిలబెట్టుకోవాలన్నా? కమర్షియల్ కోణంలో స్టామినాను నిరూపించుకోవాలన్నా? అప్ కమింగ్ సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ కొట్టాల్సిన అవసరం రవితేజకు ఎంతైనా ఉంది. దీంతో కథల ఎంపికలో రొటీన్ ఫార్ములాను పక్కనపెట్టి వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్ ఇటీవల విడుదలైన `కొరియన్ కనకరాజు` చిత్రంతో మంచి విజయాన్ని సాధించి ట్రాక్‌లోకి వచ్చారు. ఈ సినిమా విజ‌యం అందించిన ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో తొందరపాటు లేకుండా పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ గ్రాఫ్‌ను స్థిరంగా ఉంచుకోవడమే వ‌రుణ్ ముందున్న లక్ష్యం.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం `చెన్నై లవ్ స్టోరీ` చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని ప్రేక్షకుల మెప్పు పొందారు. చిన్న సినిమాల ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న కిరణ్ బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు నమోదు చేసినా? వరుస హిట్లు సాధించడంలో తరచూ తడబడుతుంటారు. అందుకే ఈసారి లభించిన విజయంతో వచ్చిన అవకాశాల విష‌యంలో బ్లైండ్ గా వెళ్ల‌కుండా కథా బలమున్న చిత్రాలనే లైన్‌లో పెట్టి కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News