కుబేరతో వీరమల్లు.. ఛాన్సే లేదు
అందరి అనుమానాలకీ చెక్ పెడుతూ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ గా జూన్ 12న సినిమా రిలీజ్ అంటూ హడావిడి చేశారు.;
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఎదురుచూస్తుంటే అంత వెనక్కి వెళ్తుంది హరి హర వీరమల్లు సినిమా. ఎప్పుడో కరోనాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా ప్రొడక్షన్ లోనే నాలుగేళ్లకు పైగా ఉంది. కరోనా రావడం, ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, మధ్యలో కొన్నాళ్ల పాటూ పవన్ ఈ సినిమాను కాదని వేరే సినిమాలు చేయడంతో ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని అందరూ అనుమానపడ్డారు.
అందరి అనుమానాలకీ చెక్ పెడుతూ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ గా జూన్ 12న సినిమా రిలీజ్ అంటూ హడావిడి చేశారు. తీరా చూస్తే ఇప్పుడు కూడా వీరమల్లు ఆ డేట్ కు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తవని నేపథ్యంలో హరి హర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయం అనిపిస్తోంది.
దీంతో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో వీరమల్లు జూన్ 20న రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జూన్ 20న ఇప్పటికే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేర షెడ్యూల్ అయి ఉంది.
సర్లే పోటీని తట్టుకుని రిలీజ్ చేద్దామంటే వీరమల్లుకు పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే కలెక్షన్లు షేర్ చేసుకుంటే కష్టమే అవుతుంది. కాబట్టి కుబేరతో పాటూ వీరమల్లును రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. దీంతో పాటూ మరో రీజన్ కూడా ఉంది. దానికి కారణం హరి హర వీరమల్లు సినిమాను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ వీడియోనే కుబేర ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసింది. కాబట్టి వీరమల్లు జూన్ 20న ఎట్టి పరిస్థితుల్లో రాదు.
జూన్ 27న వస్తుందా అంటే మంచు విష్ణు కన్నప్ప ఉంది. ఆ సినిమా కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేసేదే లేదని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి వీరమల్లుకు ఉన్న ఆప్షన్ విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కోసం లాక్ చేసుకున్న జులై 4. పవన్ కోసం ఈ డేట్ ను అడిగితే నిర్మాత నాగవంశీ ఆ డేట్ ను ఇవ్వడానికి వెనుకాడడు. కానీ తర్వాత కింగ్‌డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశీ ఇబ్బంది పడక తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మేకర్స్ ఏ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారో చూడాలి.