అప్పుడు కొమరం భీం..ఇప్పుడు పండుగ సాయన్న
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు.;
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న ఏ.ఎం.రత్నం అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ పరంగా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఎట్టకేలకు జూలై 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ క్రిష్ పరంగా, రిలీజ్ వాయిదాల పరంగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ చుట్టూ మరో వివాదంలో అలుముకుంటోంది.
17వ శతాబ్దం నేపథ్యంలో సాగే మూవీగా దీన్ని తెరకెక్కించారు. అప్పట్లో మోఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగ్‌జేబుని గడగడలాడించిన యోధుడి కథగా రూపొందిన ఈ మూవీలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరహాలో సాగే వీరమల్లు పాత్రలో నటించాడు. అయితే ఈ కథ తమ ప్రాంతానికి చెందిన రాబిన్ హుడ్, తెలంగాణ యోధుడు పండుగ సాయన్న కథని పోలివుందని ఓ వర్గం `హరి హర వీరమల్లు`పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టుని ఆశ్రయిస్తామంటున్నారు.
దీంతో 'హరి హర వీమల్లు' చుట్టూ వివాదం మొదలైంది. ఈ వివాదంపై నిర్మాత ఏ.ఎం.రత్నం తాజాగా వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫిక్షన్ అని, విష్ణు, శివుడి అంశతో పుట్టిన ఓ యోధుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ఏం చేశాడు. ఎలాంటి పోరాటం చేయాడనే పాయింట్‌తో ఈ సినిమాని నిర్మించామని, అయ్యప్పస్వామి, గరుడం, డమరుకం తదితర అంశాలని పరిగనలోకి తీసుకుని సరికొత్త మైథలాజికల్ టచ్‌తో ఈ మూవీని జ్యోతికృష్ణ అద్భుతంగా మలిచాడని స్పష్టం చేస్తున్నారు.
గతంలో ఇదే తరహాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీంలు కలిసి స్వాతంత్య్ర సంగ్రామంలో పాలు పంచుకున్నట్టుగా ఆర్ ఆర్ ఆర్‌లో చూపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో వివాదం తలెత్తింది. రాజమౌళి చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శలు చేశారు. అయితే సినిమాల రిలీజ్ తరువాత విమర్శలు చేసిన వారే జక్కన్నను ప్రత్యేకంగా అభినందించడం తెలిసిందే. ఇప్పుడు కూడా 'హరి హర వీరమల్లు' టీమ్ అదే ఫార్ములాని వాడి విమర్శలకు చెక్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.
హరి హర వీరమల్లు` ఓ ఫిక్షన్ అని నిర్మాత క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకులు తలెత్తే అవకాశం లేదని, అనుకున్న ప్రకారం 'హరి హర వీరమల్లు' జూలై 24న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడం ఖాయమని స్పష్టమవుతోంది. 'కుబేర' తరువాత వచ్చిన `కన్నప్ప`, తమ్ముడు` సినిమాలు నిరాశ పరచడంతో పవన్ సినిమాకు మంచి స్పేస్ దొరికిందని, దీన్ని ఖచ్చితంగా ఈ సినిమా వినియోగించుకుని ప్రేక్షకులకు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.