హృదయాలను కదిలించిన హంసానందిని ఎమోషనల్ నోట్
ప్రముఖ నటి హంసా నందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.;
ప్రముఖ నటి హంసా నందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఫోటోలు హంసా నందినిలోని విభిన్న కోణాలను, ముఖ్యంగా తనలోని అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో.. ప్రశాంతమైన వాతావరణంలో దిగిన ఈ ఫోటోలలో హంసా ఎంతో ఉల్లాసంగా, నవయవ్వనంగా కనిపిస్తున్నారు. తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో పాటు.. కెమెరా కళ్లకు కళ్లు కలిపి ఇచ్చిన భంగిమలు ``నేను దేనికైనా సిద్ధం`` అనే ధైర్యాన్ని చాటిచెబుతున్నాయి.
ఈ ఫోటోలతో పాటు హంసా నందిని రాసిన ఎమోషనల్ నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ``దృఢమైన వెన్నెముక, మృధువైన హృదయం.. గట్టిగా నవ్వే నవ్వు.. నేను ఎన్నోసార్లు బ్రేక్ అయ్యాను.. మళ్ళీ నన్ను నేను నిర్మించుకున్నాను.. కొత్తగా పుట్టాను! అంటూ తన జీవిత పోరాటాన్ని హంసా అక్షరీకరించారు. తాను ఇక్కడ ఎవరినో మెప్పించడానికి లేనని, కేవలం నిండుగా జీవించడానికి, గాఢంగా ప్రేమించడానికి, తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఉన్నానని పేర్కొన్నారు. మనం సున్నితమైన వాళ్లం కాదు.. మనం ప్రమాదకరమైన జీవం ఉన్నవాళ్లం! అంటూ మహిళా శక్తిని కొనియాడారు.
హంసా నందిని పోస్ట్‌పై అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. నేను చూసిన అత్యంత బలమైన మహిళల్లో మీరు ఒకరు! అంటూ హంసా స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ``మీ నవ్వు మా ఆవిడకు భలే ఇష్టం, అందుకే మీరంటే నాకూ అభిమానం`` అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ఆ ఫోటోలలో ఆమె ధరించిన దుస్తులు, ఆమె ఆహార్యం.. ఆ కళ్లలోని మెరుపు.. ఆమె ఎంతటి మానసిక ధైర్యం కలవారో స్పష్టం చేస్తున్నాయని కొందరు ప్రశంసించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన కథను తానే రాసుకుంటున్న ఒక సామాన్య మహిళకు ప్రతినిధిగా హంసానందిని ఈ ఫోటోషూట్‌లో కనిపిస్తున్నారు.
ఈ ఫోటోషూట్ కేవలం గ్లామర్ కోసం చేసింది కాదు.. అది ఒక విజేత సంబరంలా ఉంది. ప్రతి మహిళా తన కథను తానే సొంతం చేసుకోవాలి.. అది గందరగోళంగా ఉన్నా, అద్భుతంగా ఉన్నా సరే! అంటూ హంస ఇచ్చిన పిలుపు మహిళా దినోత్సవానికి సరైన అర్థాన్ని ఇచ్చింది. గతాన్ని వెనక్కి నెట్టి.. భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న హంసా నందిని తనలోని `ఫీనిక్స్`పక్షిని ఈ ఫోటోగ్రాఫ్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
హంసా నందిని కెరీర్ - వ్యక్తిగత ప్రయాణం
టాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్ , కొన్ని కీలక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హంసా నందిని అకస్మాత్తుగా పరిశ్రమ ముఖచిత్రం నుంచి అదృశ్యం కావడానికి ప్రధాన కారణం తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు. తన తల్లిని బలితీసుకున్న క్యాన్సర్ మహమ్మారి తనను కూడా చుట్టుముట్టడంతో.. ఆ ప్రాణాంతక వ్యాధితో పోరాడటానికి సినిమాలకు విరామం ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు చికిత్స తీసుకుంటూ, ఎంతో ధైర్యంతో ఆ మహమ్మారిని జయించిన హంసా.. తన పోరాట పటిమతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ విరామం కేవలం శారీరక విశ్రాంతి కోసమే కాదు.. మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం కల్పించింది.
సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో హంసా నందిని తనలోని ప్రయాణ ప్రేమికురాలిని బయటకు తీశారు. ఒక సక్సెస్‌ఫుల్ ట్రావెల్ వ్లాగర్‌గా మారి ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ అనుభవాలను తన `స్వాన్ స్టోరీస్` ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో మంచి ఆదాయాన్ని గడించడమే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. విదేశీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. పలు అంతర్జాతీయ టూరిజం బోర్డులతో కలిసి ప్రమోషన్స్ చేయడం విశేషం. ఇది హంసా కెరీర్‌కు సరికొత్త మలుపునిచ్చింది.
ప్రస్తుతం హంసా నందిని తన కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని గ్రహించిన హంసా తన ఆత్మీయుల మధ్య ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్ , ఫోటోషూట్‌లతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోవడం ఎలాగో నేర్పిన హంసా నందిని.. ఇప్పుడు తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాధిస్తున్నారు.