సోషల్ మీడియా ట్రెండ్‌కు భిన్నంగా డెబ్యూ హీరో

జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Update: 2026-07-28 03:55 GMT

ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని యువతను చూడటం దాదాపు అసాధ్యం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా యాప్‌లతో కాలం గడిపేస్తున్నారు. చాలామంది ఈ అడిక్షన్‌కు లోనై తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా.. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ బంధాలను పక్కన పెట్టి వర్చువల్ స్నేహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే నేటి తరం యువతలో .. సినీ పరిశ్రమలోకి వస్తున్న కొత్త నీటిలో కొందరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఘట్టమనేని వారసుడు, యువ హీరో ఘట్టమనేని జయకృష్ణ ఒకరు.

జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న `శ్రీనివాస మంగాపురం` చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో జయకృష్ణ ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో డిజిటల్ ప్ర‌పంచానికి దూరంగా ఉండటం.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇంటర్వ్యూ సందర్భంగా ఒక జర్నలిస్ట్ ``మీది మొదటి సినిమా కదా, అసలు ఫోన్ వాడకుండా మీ గురించి ప్రేక్షకుల్లో ఉన్న ఫీడ్‌బ్యాక్ ఎలా తెలుసుకుంటారు? ఇది ఎలా సాధ్యం?`` అని ప్రశ్నించారు. దానికి జయకృష్ణ బదులిస్తూ.. ``నేను సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండను. నాకు ఒక టీమ్.. మేనేజర్ ఉన్నారు. వారు నిరంతరం ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు. అంతేకాకుండా నాకు ఏ సమాచారం కావాలో గూగుల్‌లో వెతికి నేరుగా చదువుకుంటాను. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు ఎక్కువై సమయం వృథా అవుతోందని అనిపిస్తుంది. అందుకే ప్రస్తుతానికి దానికి దూరంగా ఉంటున్నాను. అయితే ఇది శాశ్వతమేమీ కాదు`` అని స్పష్టం చేశారు.

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు లేదా నటీనటుల చుట్టూ ఉండే టీమ్‌లు నిజమైన ఫీడ్‌బ్యాక్‌ను దాచిపెట్టి.. వారికి నచ్చే అంశాలనే చెప్తారని... ఇది అందరికీ తెలిసిందే కదా! అని జర్నలిస్ట్ మరొక ప్రశ్న వేశారు. దానికి జయకృష్ణ ఏమాత్రం సంకోచించకుండా సమాధానమిచ్చారు. ``నా చుట్టూ ఉన్న ప్రజలు చాలా నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటాను. నా టీమ్ సభ్యులు కూడా అలాగే ఉంటారు. ప్రేక్షకులు నన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా, సినిమా బాగుంది అన్నారా లేదా అనేది ఉన్నది ఉన్నట్లుగా నాకు నేరుగా చెప్పేస్తుంటారు`` అని తెలిపారు.

నేటి యువత అంతా సోషల్ మీడియా వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డెబ్యూ హీరో జయకృష్ణ ఇలాంటి స్పష్టమైన దృక్పథంతో ఉండటం ప్రశంసనీయం. సమయాన్ని వృథా చేయకుండా... కావాల్సిన సమాచారాన్ని మాత్రమే గ్రహిస్తూ... నిజమైన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించేందుకు సిద్ధపడటం అత‌డి పరిణతికి అద్దం పడుతోంది. `శ్రీనివాస మంగాపురం` సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న ఈ యువ హీరో ఆలోచనా విధానం అత‌డి సినీ ప్రయాణానికి మంచి పునాది వేస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News