లింగ పక్షపాత రహిత మరుగుదొడ్ల వివాదం!

ఆధునిక కాలంలో వివిధ సున్నితమైన సామాజిక అంశాలపై డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చర్చలు జరగడం సర్వసాధారణంగా మారింది.

Update: 2026-06-25 05:35 GMT

ఆధునిక కాలంలో వివిధ సున్నితమైన సామాజిక అంశాలపై డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చర్చలు జరగడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇలాంటి అంశాలపై సరైన అవగాహన .. వ్యక్తిగత అనుభవం లేని వ్యక్తులు అభిప్రాయాలను పంచుకున్నప్పుడు అవి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. ఇటీవల ఓపాడ్‌కాస్ట్‌లో లింగ పక్షపాత రహిత (జెండర్-న్యూట్రల్) మరుగుదొడ్ల అవశ్యకతపై వ్యక్తమైన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇది పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ - సామాజిక సమ్మిళితత్వం పై భిన్న కోణాలను ముందుకు తెచ్చింది.

ఓ టాక్ షోలో పాల్గొన్న ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒర్రీ, `ఈ జెండర్-న్యూట్రల్` మరుగుదొడ్ల భావనను ప్రశ్నిస్తూ భద్రత - గోప్యతకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తారు. కావ్య కర్నాటక్ నిర్వహించిన ఈ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు మహిళల రక్షణ దృష్ట్యా ఒర్రీ అభిప్రాయాలను సమర్థించగా, మరికొందరు ఈ సంభాషణ లైంగిక మైనారిటీల (ట్రాన్స్‌జెండర్ల) దైనందిన సమస్యలను విస్మరించేలా - అవహేళన చేసేలా ఉందంటూ వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ ద్వారా గుర్తింపు పొందిన నటి, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సమాజంలో ఒక వర్గానికి చెందిన సున్నితమైన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఆయా విషయాల్లో కనీస అవగాహన లేని లేదా ఆ జీవితాన్ని అనుభవించని వ్యక్తులను అతిథులుగా పిలవద్దని పాడ్‌కాస్ట్ నిర్వాహకులను కోరారు. అరకొర జ్ఞానంతో చేసే ఇలాంటి విమర్శలు సమాజంలో మరింత అపోహలను సృష్టిస్తాయ‌న్నారు. వెనుకబడిన వర్గాలను మరింత అణచివేతకు గురిచేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

త్రినేత్ర ఈ సందర్భంగా తన సొంత జీవితంలోని చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను వైద్య విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో మరుగుదొడ్ల విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. ఒక ట్రాన్స్‌జెండర్ మహిళగా తనకు అటు పురుషుల, ఇటు మహిళల వాష్‌రూమ్‌లు రెండూ అసురక్షితంగా మారాయని పేర్కొన్నారు. భయం కారణంగా మెడికల్ కాలేజీలో ఉన్నంతసేపు నీళ్లు తాగడం మానేయడంతో తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడాల్సి వచ్చిందన్నారు. ఇవి కేవలం సిద్ధాంతపరమైన చర్చలు కావని, తమ లాంటి వారి ఆరోగ్యం , మనుగడకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేయాలని కోరడం లేదన్నారు. మహిళలు .. చిన్న పిల్లలు పురుషులతో వాష్‌రూమ్‌లను పంచుకోవాలనే ప్రతిపాదన ఎవరూ చేయడం లేదని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలన్నదే తమ ఆశయమని తెలిపారు. సమాజంలో పురుషులు, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఉంటూనే, మూడవ ప్రత్యామ్నాయంగా లింగ పక్షపాత రహిత సురక్షితమైన ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పుడే అందరి భద్రతకు న్యాయం జరుగుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ వివాదం సమాజంలో డిజిటల్ క్రియేటర్లు వహించాల్సిన బాధ్యతను మరోసారి గుర్తుచేస్తోంది. కేవలం వ్యూస్ లేదా రేటింగుల కోసం సున్నితమైన సమస్యలను వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని త్రినేత్ర పేర్కొన్నారు. ప్రజా బాహుళ్యంలో సామాజిక సమస్యపై సరైన అవగాహన కల్పించాలంటే అన్ని వర్గాల వాస్తవిక దృక్పథాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రమైన చర్చలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News