ప్ర‌మాద‌వశాత్తూ ముక్కుపుడ‌క మింగిసిన న‌టి.. అభిమానుల్లో టెన్ష‌న్!

సినిమా షూటింగ్‌లు అంటే కేవలం గ్లామర్.. యాక్షన్ మాత్రమే కాదు.. కెమెరా వెనుక నటీనటులు పడే కష్టం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు ఎదుర‌వుతుంటాయి.

Update: 2026-08-10 14:16 GMT

సినిమా షూటింగ్‌లు అంటే కేవలం గ్లామర్.. యాక్షన్ మాత్రమే కాదు.. కెమెరా వెనుక నటీనటులు పడే కష్టం.. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు ఎదుర‌వుతుంటాయి. షాట్ రన్ అవుతున్న సమయంలో అజాగ్రత్త వల్ల కాకుండా పూర్తిగా ప్రమాదవశాత్తు సెట్‌లో వస్తువులను నోట్లోకి తీసుకెళ్లి లేదా మింగేసి తీవ్రమైన ఇబ్బంది పడిన నటీనటుల సంఘటనలు పరిశ్రమలో అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, పాపులర్ నటి షెహనాజ్ గిల్ కి కూడా తన కొత్త సినిమా `ఇష్క్‌నామా` సెట్‌లో సరిగ్గా అలాంటి భయానకమైన అనుభవమే ఎదురైంది.

పంజాబీ పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక రన్నింగ్ సీన్ చేస్తున్న సమయంలో షెహనాజ్ ముక్కుపుడక అనుకోకుండా జారి నేరుగా ఆమె నోటిలోకి పడింది. ఊహించని ఈ ప్రమాదంతో ఆ ముక్కుపుడక గొంతులో అడ్డుపడటంతో షెహ‌నాజ్ తీవ్ర అస్వస్థతకు గురై విపరీతంగా దగ్గడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను షెహనాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

ఈ విపత్కర సమయంలో ఆమె కో-స్టార్ సౌరభ్ సచ్‌దేవా చాకచక్యంగా వ్యవహరించి తక్షణ సహాయం అందించారు. షెహనాజ్ గొంతులో ముక్కుపుడక పడి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సౌరభ్ వెంటనే ఆమె వీపుపై తడుతూ.. ఆ వస్తువు బయటకు వచ్చేలా సహాయం చేశారు. ఆయన సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పుకోవడంతో షెహనాజ్ వెంటనే కోలుకోగలిగింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ``మీలో చాలామంది నన్ను ఈ నథ్నీ మూమెంట్‌ను పోస్ట్ చేయమని అడిగారు`` అని క్యాప్షన్ జోడించింది.

ఈ వీడియో చూసిన షెహనాజ్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని... ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాలని టిజన్లు సూచించారు. ``దేవుడి దయ వల్ల సనా సురక్షితంగా బయటపడింది`` అంటూ ఆమె శ్రేయోభిలాషులు కామెంట్ల రూపంలో ఉపశమనం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

అరవిందర్ ఖైరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఇష్క్‌నామా` చిత్రంలో జే రాంధవా, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారత్‌కు చెందిన సిక్కు విద్యార్థికి, పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం యువతికి మధ్య సాగే ప్రేమకథ ఆధారంగా ఇది రూపొందుతోంది. ఇక ఈ సినిమాతో పాటు నవనియత్‌ సింగ్‌ దర్శకత్వంలో గిప్పీ గ్రెవాల్ సరసన షెహనాజ్ నటించిన రొమాంటిక్ కామేడీ చిత్రం `సింగ్ వర్సెస్ కౌర్ 2` సెప్టెంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

సినీ సెట్లలో ఆర్టిస్టులకు ఎదురయ్యే ఇలాంటి అనుకోని ఇబ్బందులు-అనుభవాలను ప‌రిశీలిస్తే...సాధారణంగా చారిత్రక లేదా పౌరాణిక చిత్రాల షూటింగ్ సమయంలో నటీమణులు భారీ ఆభరణాలు (నథ్నీ-ముక్కుపుడక, హారాలు, చెవి దుద్దులు) ధరించి డ్యాన్స్ లేదా రన్నింగ్ సీన్లు చేస్తున్నప్పుడు అవి జారి నోట్లోకి వెళ్లడం లేదా గాయాలవ్వడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇవి షూటింగ్ స్పాట్‌లోనే సర్దుబాటు కావడం వల్ల మీడియా వరకు రావు.

తెలుగు సినిమాల విషయానికొస్తే.. ఎక్కువగా యాక్షన్ సీన్లలో గాయపడటం (కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, అనుష్క వంటి వారు), లేదా కేరళ వాతావరణంలో షూటింగ్స్ చేసేటప్పుడు కీటకాలు లేదా నీటి వల్ల అలర్జీలు రావడం వంటి సంఘటనలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. షెహ్నాజ్ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఎదురైనా అవి మీడియా వ‌ర‌కూ రాలేదు.



Tags:    

Similar News