యూత్ మైండ్‌ని కలుషితం చేసేసిన 'టాక్సిక్' లేడీ!
ప్రస్తుతం భారతీయ సినీ వర్గాల్లో ఏ నోట విన్నా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరే మార్మోగుతోంది.
ప్రస్తుతం భారతీయ సినీ వర్గాల్లో ఏ నోట విన్నా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ పేరే మార్మోగుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న అంతర్జాతీయ స్థాయి భారీ యాక్షన్ డ్రామా `టాక్సిక్` చిత్రానికి ఒక నటి దర్శకత్వం వహిస్తుండటమే అందుకు ప్రధాన కారణం. నటిగా, జాతీయ అవార్డు గ్రహీత అయిన దర్శకురాలిగా పరిశ్రమలో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతూ `టాక్సిక్` సినిమాతో భారతీయ ప్రేక్షకులలో.. ముఖ్యంగా నేటి యువత మైండ్‌ను తన మేకింగ్ శైలితో విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
గీతూ మోహన్‌దాస్ సినీ ప్రయాణం నటిగా ప్రారంభమైంది. తమిళంలో మాధవన్ సరసన వచ్చిన `నల దమయంతి` చిత్రంతో పాటు పలు మలయాళ సినిమాల్లో కథానాయికగా అలరించారు. ఆ తర్వాతి కాలంలో ప్రయోగాత్మక మలయాళ చిత్రం `రాపకల్` వంటి సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి గీతూ నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. నేటికీ గీతూ- నయనతార అత్యంత ఆత్మీయ స్నేహితులుగా కొనసాగుతూ ఒకరి సినీ ప్రయాణానికి మరొకరు మద్దతుగా నిలుస్తున్నారు.
నటనలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కథలు చెప్పాలనే తపనతో గీతూ దర్శకురాలిగా మారారు. తెరకెక్కించిన తొలి చిత్రం `లైయర్స్ డైస్` రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డులకు కూడా భారత అధికారిక ఎంట్రీగా ఎంపికై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నివిన్ పౌలీతో తీసిన `మూథోన్` చిత్రం అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. గీతూలోని ప్రతిభావంతమైన దర్శకురాలిని ప్రపంచానికి పరిచయం చేసింది.
ఇప్పుడు యష్‌తో రూపుదిద్దుకుంటున్న `టాక్సిక్` చిత్రాన్ని త్యంత వినూత్నంగా, విజ్యువల్ స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నారు. డార్క్ థీమ్‌తో సాగే యాక్షన్ సీక్వెన్సెస్.. హాలీవుడ్ స్థాయి మేకింగ్ .. విజువల్స్ యూత్‌లో తీవ్రమైన క్రేజ్‌ను పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన ప్రేక్షకులు గీతూ ప్రదర్శించిన టెక్నికల్ విజన్‌కు ఫిదా అవుతున్నారు. `టాక్సిక్` ప్రాజెక్ట్‌తో గీతూ పాన్-ఇండియా స్థాయిలో అగ్ర దర్శకుల సరసన నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఇటీవల సోషల్ మీడియాలో గీతూ మోహన్‌దాస్ రూపాంతరంపై విపరీతమైన చర్చ నడిచింది. ఆమె తాజా ఫోటోలు, వీడియోలను చూసిన కొందరు కాస్మెటిక్ ఫిల్లర్స్‌పై కామెంట్లు చేయగా.. మరికొందరు `నల దమయంతి` రోజుల నాటి ఆమె రూపాన్ని గుర్తుచేసుకుంటూ మద్దతుగా నిలిచారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ట్రోలింగ్స్ సహజమే అయినా.. అవన్నీ పక్కనబెట్టి `టాక్సిక్` చిత్రం ద్వారా తన అసమానమైన దర్శకత్వ ప్రతిభతోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు గీతూ మోహన్‌దాస్.