నిధులు మళ్లించిన దర్శకుడు.. నిర్మాతకు వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు
నిరంతర వివాదాల కారణంగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ చాలా చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు.;
నిరంతర వివాదాల కారణంగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ చాలా చిక్కుల్ని ఎదుర్కొంటున్నారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు తాజాగా మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక పాత కేసులో ఆయన ఓడిపోయారు. సినిమా కోసం ఖర్చు చేయాల్సిన నిధులను మళ్లించాడని కోర్టు అతడికి చీవాట్లు పెట్టింది. అంతేకాదు.. ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థకు ఆయన భారీ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దాదాపు రూ.4.25 కోట్ల అసలు డబ్బును 12శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ వివాదం 2008లో మొదలైంది. ప్రొడక్షన్ నెం. 6 సినిమా కోసం గౌతమ్ మీనన్ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీతో నిర్మాత ఎల్రెడ్ కుమార్ (ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్) ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో నిర్మాత పలు విడతల్లో 4.25 కోట్లు చెల్లించారు. కానీ ఒప్పందం ప్రకారం... నిర్ణీత సమయంలో సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. దీనిపై నిర్మాత 2013లో సివిల్ సూట్ వేశారు.
కోర్టులో గౌతమ్ మీనన్ తన వాదన వినిపించారు. తాము నిర్మించిన `నీతానే ఎన్ పొన్వసంతం` (తెలుగులో `ఎటో వెళ్ళిపోయింది మనసు`) చిత్రమే ఆ ఒప్పందం కింద తీసిన సినిమా అని పేర్కొన్నారు. ఆ సినిమా విడుదలైనందున తమ బాధ్యత తీరిపోయిందని వాదించారు. అయితే ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఆ సినిమా వేరే ఒప్పందం కింద రూపొందిందని న్యాయమూర్తి గుర్తించారు.
ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ ఇచ్చిన నిధులను గౌతమ్ మీనన్ సదరు సినిమా కోసం వాడలేదని కోర్టు తేల్చింది. నిధుల వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దీంతో 2010 మే నెల నుండి ఇప్పటివరకు 12 శాతం వడ్డీతో కలిపి 4.25 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా కోర్టు, లాయర్ ఫీజుల కింద మరో రూ.12 లక్షలు చెల్లించాలని ఆర్డర్ జారీ చేసింది.
గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ గౌతమ్ మీనన్ అప్పీలు చేశారు. తాజాగా జస్టిస్ పి. వేల్మురుగన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆ అప్పీలును కొట్టివేసింది. పాత తీర్పునే సమర్థిస్తూ దర్శకుడు, అతడి సంస్థ వెంటనే డబ్బు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.