టాలివుడ్ మార్కెట్: గట్టెక్కాలంటే దారేది? నిర్మాతలకు హెచ్చరిక?
మరి ఈ గందరగోళం నుంచి నిర్మాతలు బయటపడాలంటే అందరూ ఒకే రూట్లో వెళితేనే బెటర్.;
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పరిస్థితి చూస్తుంటే "ముందు నుయ్యి వెనుక గొయ్యి" అన్న సామెత గుర్తొస్తుంది. సినిమా బిజినెస్ అనేది ఒకప్పుడు పక్కా లెక్కలతో ఉండేది. కానీ ఇప్పుడు అదొక అంతుచిక్కని ఫజిల్ లా మారింది. కేవలం సోషల్ మీడియాలో వచ్చే హైప్ చూసి, అంచనాల మీద కోట్లు కుమ్మరించేస్తున్నారు. తీరా రిలీజ్ అయ్యాక గ్రౌండ్ రియాలిటీ చూస్తే దిమ్మతిరుగుతోంది. మరి ఈ గందరగోళం నుంచి నిర్మాతలు బయటపడాలంటే అందరూ ఒకే రూట్లో వెళితేనే బెటర్. ఇప్పటికే చాలామంది నిర్మాతలపై భారం పడకుండా కొన్ని పద్ధతులను ఫాలో అవుతున్నారు.
నిర్మాతలు ఇన్నాళ్లూ ఒక భ్రమలో బతికారు. థియేటర్లో సినిమా ఆడకపోయినా పర్లేదు.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ లేదా హిందీ డబ్బింగ్ రైట్స్ తో గట్టెక్కేయొచ్చు అనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ 'సేఫ్ జోన్' పూర్తిగా కనుమరుగైంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తమ నిబంధనలు మార్చేశాయి, హిందీ మార్కెట్ కుప్పకూలింది. "నాన్ థియేట్రికల్" అనే నమ్మకం పోయింది. అయినా సరే ఖర్చు మాత్రం తగ్గడం లేదు. ఇక్కడే అసలు లోపం జరుగుతోంది. దీన్ని సరిదిద్దడమే మొదటి పరిష్కారం.
దీనికి మెయిన్ సొల్యూషన్.. 'మార్కెట్ రియాలిటీ'ని గ్రహించడం. హీరో స్టార్ డమ్ ని కాకుండా, అతని ప్రస్తుత బాక్సాఫీస్ స్టామినాను మాత్రమే నమ్ముకోవాలి. కేవలం కాంబినేషన్ క్రేజ్ చూసి భారీ పారితోషికాలు ఇవ్వడం ఆపేయాలి. ఒక హీరో సినిమాకి థియేటర్లో మినిమమ్ గ్యారెంటీ ఎంత? ఓపెనింగ్స్ తెచ్చే సత్తా ఎంత? అనే పక్కా లెక్కలు వేసుకున్నాకే బడ్జెట్ కేటాయించాలి. గాలిలో మేడలు కట్టి, ఆ తర్వాత బయ్యర్ల మీద, ఓటీటీల మీద భారం వేస్తే లాభం లేదు.
ఇక అత్యంత ముఖ్యమైన పరిష్కారం.. 'ప్రాఫిట్ షేరింగ్'. సినిమా షూటింగ్ మొదలవ్వకముందే హీరోలకు, టెక్నీషియన్లకు భారీగా అడ్వాన్సులు ఇచ్చి చేతులు కాల్చుకోవడం కంటే, వాళ్లను కూడా బిజినెస్ లో భాగస్వామ్యులను చేయాలి. సినిమా సక్సెస్ అయితేనే లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని ఇండస్ట్రీ మొత్తం పాటించాలి. అప్పుడే ప్రాజెక్ట్ మీద అందరికీ బాధ్యత పెరుగుతుంది, బడ్జెట్ అదుపులో ఉంటుంది. ఇప్పటికే అగ్ర దర్శకులు చాలామంది ఇది ఫాలో అవుతున్నారు. ఇది టైర్ 2 రేంజ్ సినిమాలకు కూడా వర్తిస్తే బెటర్.
అలాగే ఓటీటీల మీద అతిగా ఆధారపడటం మానేయాలి అనే కామెంట్స్ వస్తున్నాయి. సినిమా అనేది ప్రాథమికంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసేది. అక్కడే కంటెంట్ క్లిక్ అయితే ఆటోమేటిక్ గా మిగతా రెవెన్యూ వస్తుంది. అలా కాకుండా ముందే డిజిటల్ డీల్స్ చూసుకుని, టేబుల్ ప్రాఫిట్ కోసం ప్రాజెక్ట్ సెట్ చేస్తే, చివరకు మిగిలేది నాణ్యత లేని సినిమాలే. కంటెంట్ మీద పెట్టే శ్రద్ధ, అనవసరపు ఆర్భాటాల మీద తగ్గించాలి అని మరికొందరు చెబుతున్న మాట.
ఇది ఇండస్ట్రీకి ఒక "కరెక్షన్ టైమ్". బడ్జెట్ ను కథకు తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాలి తప్ప, హీరో ఇమేజ్ కు తగ్గట్టు కాదు. రిస్క్ చేసి సినిమా తీసేది నిర్మాత అయినప్పుడు, ఆ రిస్క్ ని తగ్గించుకునే బాధ్యత కూడా హీరోలు, దర్శకులు తీసుకోవాలి. ఈ మార్పు రాకపోతే, నిర్మాత అనేవాడు కేవలం డబ్బులు లెక్కపెట్టే క్యాషియర్ లా మిగిలిపోతాడు. తెలివిగా అడుగులేస్తేనే ఈ సుడిగుండం నుంచి బయటపడగలరని చెప్పవచ్చు.